ముద్దుగుమ్మ లావణ్య త్రిపాఠి నటిస్తున్న తాజా చిత్రం 'ఇంటెలిజెంట్'. ఈ ముద్దుగుమ్మకి ఈ సినిమా అగ్ని పరీక్షే. ఎందుకంటే ఈ సినిమాకి సంబంధించినంతవరకూ లావణ్య ఎదుర్కోవాల్సిన మెయిన్ టాస్క్ డాన్స్. లావణ్య మంచి డాన్సరే. అయితే ఇంతవరకూ ఆమె డాన్సుల్లో తనను తాను ప్రూవ్ చేసుకున్నది లేదు. 'భలే భలే మగాడివోయ్' సినిమాలో కొంచెం కష్టపడింది. కానీ అంతకు ముందు, ఆ తర్వాత కూడా ఆమె పెద్దగా డాన్సులేయాల్సిన అవసరం రాలేదు. సో ఈ సారి డాన్సుల విషయంలో లావణ్య మరి కొంచెం ఎక్కువే కష్టపడాల్సి వచ్చుంటుందనుకోవాలి.
మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ డాన్సుల్లో దిట్ట. ఇది తెలిసిన సంగతే. అందులోనూ 'ఇంటెలిజెంట్' ప్రోమోస్ చూస్తుంటే, తేజు డాన్సులు ఇరగదీసేశాడనిపిస్తోంది. ఈ సినిమాలో చిరంజీవి సినిమా 'కొండవీటి దొంగ'లోని 'చమక్ చమక్ చం..' సాంగ్‌ని రీమిక్స్ చేశారు. ముఖ్యంగా ఈ సాంగ్ విషయానికి వస్తే, హీరోయిన్‌కి డాన్సులో ఈజ్ కనిపించాలి. నెక్ట్స్ కో స్టార్‌ని మెప్పించాలి. అప్పట్లో చిరంజీవి, విజయశాంతి నటించారు ఈ సాంగ్‌లో. వారిద్దరి కెమిస్ట్రీని మ్యాచ్ చేయాల్సి ఉంటుంది. ఇలా ఇన్ని రకాల టాస్క్‌లు ఆమె ముందున్నాయి. అయితే లావణ్య బాగా కష్టపడినట్లే అనిపిస్తోంది.
స్టిల్స్లోనూ, ప్రోమో సాంగ్స్‌లోనూ లావణ్య, తేజు కెమిస్ట్రీకి ప్రశంసలే దక్కుతున్నాయి. గ్లామర్ పరంగానూ ఈ ముద్దుగుమ్మ ఇంతకు ముందెన్నడూ కనిపించనంత గ్లామరస్‌గా కనిపిస్తోంది ఈ సినిమాలో. అయితే సినిమాలో వీరి మధ్య కెమిస్ట్రీ ఎలా ఉండబోతోందనే విషయం ఇక మరి కొద్ది రోజుల్లోనే తేలిపోనుంది. వినాయక్ దర్శకత్వంలో ఈ సినిమా పక్కా యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కింది. ఈ నెల 9న ప్రేక్షకుల ముందుకు రానుంది.