‘ఆ దేవుడు, ఈ దేవుడు.. ఏ దేవుడూ లేడు.. దేవాలయాలు, మసీదులు, చర్చిలకు జనం వెళ్ళే పరిస్థితుల్లేవు.. అంతా కరోనా ఎఫెక్ట్..’ అంటూ చాలా మంది సోషల్ మీడియా వేదికగా రకరకాల పోస్ట్‌లు పెడుతున్నారు. ఇందులో కొంత నిజం లేకపోలేదు కూడా. కానీ, అందాల రాక్షసి లావణ్య త్రిపాఠి మాత్రం ‘దేవుడు వున్నాడు’ అంటోంది. ఓ నెటిజన్ ప్రశ్నకి సమాధానమిచ్చిన లావణ్య త్రిపాఠి, దేవుడు ప్రస్తుతం ఆసుపత్రిలో వున్నాడనీ.. మనల్ని రక్షించడమే పనిగా పెట్టుకున్నాడనీ పేర్కొంది. నిజమే, ఇప్పుడు డాక్టర్లే దేవుళ్ళు... అన్ని మతాలకి చెందినవారికీ కూడా.. ఆ డాక్టర్లే దేవుళ్ళు. డాక్టర్లు మాత్రమే కాదు, జనం రోడ్ల మీదకు రాకుండా అదుపు చేస్తోన్న పోలీసులు కూడా. ఆ మాటకొస్తే, తమ ప్రాణాల్ని పణంగా పెట్టి శానిటైజేషన్ చేస్తున్న సిబ్బందీ.. మనకి నిత్యావసర వస్తువుల్ని అందిస్తున్న వ్యాపారులు.. వీళ్ళంతా దేవుళ్ళే. లావణ్య త్రిపాఠి మాత్రమే కాదు, ఇప్పుడు చాలామంది చెబుతోన్న మాట ఇదే.
మన కోసం ప్రాణాలకు తెగించి మరీ పనిచేస్తోన్నవారందరినీ దేవుళ్ళలా చూడకపోయినా ఫర్లేదు.. వారి క్షేమం కోసం ప్రార్థిద్దాం.. అదే సమయంలో, వారి సేవల్ని గుర్తిద్దాం. వారి సూచనలకు అనుగుణంగా ఇంట్లోనే వుందామంటూ పలువురు సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా విజ్ఞప్తి చేస్తున్నారు. ఇక, లావణ్య త్రిపాఠి తెలుగు సినిమాల విషయానికొస్తే, ప్రస్తుతం ఆమె సందీప్ కిషన్ సరసన ‘ఎ1 ఎక్స్‌ప్రెస్’ సినిమాలో నటిస్తోంది. ‘ఆర్‌ఎక్స్ 100’ ఫేం కార్తికేయ సరసన ‘చావు కబురు చల్లగా’ అనే సినిమాలోనూ నటిస్తోంది లావణ్య త్రిపాఠి.