పూరి జగన్నాథ్ మొన్నామధ్య బాలకృష్ణతో ‘పైసా వసూల్’ సినిమా తెరకెక్కించిన విషయం విదితమే. ఆ సమయంలోనే బాలయ్యతో ఇంకో సినిమా చేయాలనుకుంటున్నట్లు పూరి జగన్నాథ్ చెప్పాడు. పైగా, ‘పైసా వసూల్’ నిరాశపర్చడంతో, బాలయ్యబాబుకి బాకీ పడ్డానంటూ పూరి అభిప్రాయపడ్డాడు. ఆ బాకీ తీర్చుకునే ప్రయత్నంలో పూరి బిజీగా వున్నాడంటూ టాలీవుడ్ సర్కిల్స్‌లో గాసిప్స్ విన్పిస్తున్నాయి. నిజానికి పూరి జగన్నాథ్ దగ్గర చాలా చాలా కథలుంటాయి. చాలా వేగంగా కథల్ని రూపొందిస్తుంటాడు పూరి జగన్నాథ్. ఇప్పుడెలాగూ లాక్ డౌన్ పీరియడ్ కావడంతో, తాను గతంలో రాసుకున్న కథలకు పదును పెడుతున్నాడట.
గతంలోనే బాలయ్య కోసం రాసిన ఓ కథకు మెరుగులు దిద్దే పనిలో బిజీగా వున్నాడట పూరి జగన్నాథ్. అయితే, ఈ కథకి వేరే దర్శకుడైతే బావుంటుందన్న ఆలోచనలో పూరి వున్నాడంటూ టాలీవుడ్ సర్కిల్స్‌లో గుసగుసలు విన్పిస్తున్నాయి. పూరితో సినిమా అంటే బాలయ్య ‘నో’ చెప్పే అవకాశముండదు. కానీ, పూరి కథ.. ఇంకెవరో డైరెక్టర్ అంటే బాలయ్య కాస్త ఆలోచిస్తాడేమో. ఒకవేళ పూరి జగన్నాథ్ ఈ సినిమాకి నిర్మాతగా కూడా వ్యవహరిస్తానంటేనో.? బాలయ్యకు అభ్యంతరాలు వుండకపోవచ్చు. ప్రస్తుతం బాలయ్య, బోయపాటి డైరెక్షన్‌లో రూపొందుతోన్న సినిమా చేస్తున్నాడు. పూరి జగన్నాథ్, విజయ్ దేవరకొండతో ‘ఫైటర్’ సినిమా తెరకెక్కిస్తోన్న విషయం విదితమే.