అందాల రాక్షసి లావణ్య త్రిపాఠి సైబర్ క్రైమ్ పోలీసునాశ్రయించింది. ఎందుకంటారా.? వివరాల్లోకి వెళదాం. శ్రీ రామోజు సునిశిత్ అనే వ్యక్తితో తనకు వివాహమైందంటూ, సోషల్ మీడియాలో అసత్య ప్రచారం జరుగుతోందంటూ, సదరు వ్యక్తి సునిశిత్ ఈ అసత్య ప్రచారం చేస్తున్నాడనీ తన ఫిర్యాదులో పేర్కొంది లావణ్య త్రిపాఠి. అంతేకాదు, పలు యూ ట్యూబ్ ఛానెల్స్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూల్లోనూ లావణ్యపై ఆ వ్యక్తి అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నాడట. ఈ విషయమై పూర్తి వివరాలను, వీడియోలతో సహా లావణ్య సైబర్ క్రైమ్ పోలీసుకు అందించారు.
ఆ దిశగా విచారణ జరిపిన పోలీసులు సదరు వ్యక్తిపై కేసు నమోదు చేశారు. వీడియోలను పరిశీలించిన పిమ్మట, ఆ వ్యక్తి జైలుకు వెళ్లక తప్పదని హెచ్చరించారు. అయితే, సునిశిత్ కేవలం లావణ్యను మాత్రమే కాదు, ఇతర సెలబ్రిటీపై కూడా అసత్య ఆరోపణలు చేస్తూ, అసభ్య పదజాలంతో మాట్లాడుతున్నాడనీ పోలీసు తెలపడం కొసమెరుపు. కానీ, ఇంతవరకూ ఏ సెలబ్రిటీ సునిశిత్‌పై ఫిర్యాదు చేయలేదట. లావణ్య త్రిపాఠి మాత్రమే ధైర్యంగా ముందుకొచ్చి ఫిర్యాదు చేసిందనీ, పూర్తి విచారణ అనంతరం, సదరు వ్యక్తికి తగిన శిక్ష పడేలా చూస్తామని తెలిపారు. ఇకపోతే, ఈ మధ్య సెలబ్రిటీల్ని ఈ రకంగా వేధింపులకు గురి చేయడం ఫ్యాషన్ అయిపోయింది. సైబర్ క్రైమ్స్‌లో వీరి ఆటలకు చెల్లు చీటీ పాడుతున్నా, ఈ చిల్లరగాళ్ల ఆగడాలు ఆగడం లేదు.