హీరోయిన్ పూజా హెగ్దే జార్జియాలో మాక్సిమం ఎంజాయ్ చేసేస్తోంది. ఇటీవలే జార్జియాకి వెళ్ళిన ఈ బ్యూటీ ప్రభాస్ హీరోగా, రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో తెరెక్కుతోన్న సినిమా షూటింగ్‌లో పాల్గొన్న విషయం విదితమే. జార్జియాలో ప్లాన్ చేసిన షెడ్యూల్ పూర్తయ్యింది. సీన్స్ చాలా అద్భుతంగా వచ్చాయని చిత్ర యూనిట్ ఇప్పటికే ప్రకటించింది. మరోపక్క, ఈ సినిమా ఫస్ట్ లుక్ త్వరలో విడుదల చేయబోతున్నారట. ఇవన్నీ ఓ ఎత్తు, జార్జియా నుంచి పూజా హెగ్దే ఇస్తోన్న స్పెషల్ అప్‌డేట్స్ ఇంకో ఎత్తు. అక్కడి వీధుల్లో ఎంజాయ్ చేస్తూ, దానికి సంబంధించిన వీడియోల్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తోంది పూజా హెగ్దే.
తాజాగా, మంచు కురుస్తున్న వేళ, వీధుల్లో నిల్చుని ఎంజాయ్ చేస్తున్న ఫొటోల్ని పూజా హెగ్దే సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇంకేముంది.? అభిమానులు ఓ రేంజ్‌లో షాక్ అవుతున్నారు. ప్రపంచమంతా కోవిడ్ 19 (కరోనా వైరస్)తో అతలాకుతలమవుతున్న వేళ, అస్సలేమాత్రం భయం లేకుండా పూజా హెగ్దే జార్జియా వీధుల్లో తిరిగేస్తోంది. ‘ఎందుకైనా మంచిది మొహానికి మాస్క్ పెట్టుకో..’ అని చాలామంది ఆమెకు సూచిస్తున్నారు. మరికొందరు, ‘ఇది మరీ ఓవరాక్షన్‌లా అన్పించడంలేదా.?’ అని ఆమెను ప్రశ్నిస్తున్నారు. ‘ఇండియాకి వచ్చాక ఎలాగూ మిమ్మల్ని క్వారంటైన్‌లో పెడతారు..’ అంటూ ఇంకొందరు కామెంట్ చేస్తున్నారు. ఏదిఏమైనా, పూజా హెగ్దే డేరింగ్ అండ్ డాషింగ్ ఆటిట్యూడ్ ఇంకోసారి ప్రూవ్ అయ్యింది.. ఆమె జార్జియా నుంచి ఇస్తోన్న అప్‌డేట్స్‌తో. అస్సలామెకి భయం లేదంతే.!