ఈరోజుల్లో సినిమాకి ఎంత హైప్ తీసుకొస్తే అంత మంచిది. చిన్న సినిమాకి ప్రమోషన్ చాలా అవసరం. పెద్ద సినిమాకి ఇంకా అవసరం. పైగా పాన్ ఇండియా క్రేజ్ తెచ్చుకోవాలంటే సినిమా మొదలైనప్పటి నుంచీ... విడుదల వరకూ ప్రచారంతో హోరెత్తించాల్సిందే. వివిధ రూపాలయలో, వివిధ వేదికలపై సినిమా గురించి మాట్లాడుకొనేలా చేయాలి. పుష్ప, ఆర్.ఆర్.ఆర్, కేజీఎఫ్ సినిమాలు అవే చేశాయి. అయితే... ఈ విషయంలో మణిరత్నం అట్టర్ ఫెయిల్యూర్ అవుతున్నారు.
మణిరత్నం దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం `పొన్నియన్ సెల్వన్`. మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ ఇది. దాదాపుగా రూ.500 కోట్లు ఖర్చు పెడుతున్నారు. లైకా సంస్థ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. విక్రమ్, కార్తి, ఐశ్వర్యరాయ్... ఇలా చాలామంది స్టార్ గణముంది. ఈమధ్యే వీళ్ల లుక్కులు కూడా రిలీజ్ చేశారు. అయితే.. ఈ సినిమాపై బజ్ శూన్యం. సోషల్ మీడియాలో కూడా ఈ సినిమా గురించి పెద్దగా మాట్లాడుకోవడం లేదు. రూ.500 కోట్ల సినిమా... పైగా మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్.
అలాంటప్పుడు బజ్ ఏ రేంజ్‌లో ఉండాలి? కానీ.. అదేం కనిపించడం లేదు. దాంతో చిత్రబృందంలో టెన్షన్ పెరుగుతోంది. ఇంత భారీ సినిమాకి క్రేజ్ రాకపోతే.. పెట్టుబడి రాబట్టడం చాలా కష్టం. అందుకే ఏదోలా ఈ సినిమాకి బజ్ తెచ్చేలా చూసేందుకు టీమ్ అంతా కిందా మీదా పడుతోందట. మణిరత్నంకి ఎన్ని కష్టాలొచ్చాయో..?