విజయ్ దేవరకొండ - పూరి జగన్నాథ్ కాంబినేషన్‌లో రూపొందిన పాన్ ఇండియా సినిమా లైగర్. ఆగస్టు 25న వస్తోంది. ఈసినిమాపై ఏకంగా రూ.160 కోట్ల పెట్టుబడి పెట్టినట్టు టాక్. దాంతో.. ట్రేడ్ వర్గాలు ఖంగుతిన్నాయి.
రూ.160 కోట్లు రికవరీ అవుతాయా? అంటూ అనుమానాలు వ్యక్తం చేశాయి. అయితే.. వాటన్నింటినీ లైగర్ పటాపంచలు చేస్తోంది. ఈ సినిమాకి సంబంధించిన డిజిటల్, శాటిలైట్ రైట్స్ అన్ని భాషల్లోనూ కలిపి రూ.97 కోట్లకు అమ్ముడుపోయినట్టు తెలుస్తోంది. హిందీ మినహా అన్ని భాషల్లోనూ లైగర్‌ని రూ.80 కోట్లకు అమ్మేశారు. ఇప్పుడు బాలీవుడ్ డీల్ క్లోజ్ కావాలి. అక్కడి నుంచి కనీసం 20 నుంచి 30 కోట్ల వరకూ వస్తే... మొత్తంగా రూ.200 కోట్ల బిజినెస్ చేసినట్టు. అంటే.. రూ.40 కోట్లు లాభమన్నమాట. పాన్ ఇండియా సినిమాకి... విడుదలకు ముందే లాభాలు చూడడం ఈమధ్య కాలంలో ఇదే తొలిసారేమో..? ఇటీవలే లైగర్ ట్రైలర్ బయటకు వచ్చింది. ఆ ట్రైలర్... లైగర్ పై అంచనాల్ని అమాంతంగా పెంచేసింది. దాంతో.. బయ్యర్లు ఈ సినిమా కోసం ఎగబడుతున్నారు. మొత్తానికి నెల రోజుల ముందే.... పూరి తన బిజినెస్ ని దాదాపుగా క్లోజ్ చేసేశాడు. ఓ రకంగా.. పూరి ముందే లాభాల్లో మునిగిపోయినట్టు.