తెలుగులో స్పోర్ట్స్ డ్రామా కథలు ఇప్పుడు మళ్లీ ఊపందుకొంటున్నాయి. అయితే.. స్పోర్ట్స్ డ్రామాని ఓ పెద్ద హీరో, ఓ అగ్ర దర్శకుడు తీస్తే.. ఆ మజానే వేరు. `లైగర్`తో అది దొరకబోతోంది. బాక్సింగ్ నేపథ్యంలో సాగే సినిమా ఇది. పూరి జగన్నాథ్ దర్శకుడు. విజయ్ దేవరకొండ కథానాయకుడు. పాన్ ఇండియా వ్యాప్తిగా ఆగస్టు 22న వస్తోంది. ఈరోజు... అన్ని భాషల్లోనూ ట్రైలర్‌ని వదిలారు.
రెండు నిమిషాల 2 సెకన్ల టీజర్ ఇది. ఇందులోనే మొత్తం సినిమా చూపించేశాడు పూరి. `ఒక లయన్‌కీ, టైగర్‌కీ పుట్టుంటాడు.. క్రాస్ బ్రీడ్ సార్ నా బిడ్డ` అంటూ రమ్యకృష్ణ డైలాగ్‌తో ట్రైలర్ మొదలైంది. అక్కడి నుంచి... అంతా యాక్షన్ ఫీస్టే.
ఈ సినిమాలో హీరోకి నత్తి ఉంటుందని ముందు నుంచీ చెబుతూనే ఉన్నారు. ట్రైలర్ లో కూడా అదే చూపించారు. ఐ...ఐ... ఐ.. ఐలవ్యూ... అంటూ నత్తినత్తిగా మాట్లాడుతూ విజయ్ షాక్ ఇచ్చాడు. బాక్సింగ్ రింగ్ లో పంచ్‌లూ, బయట రౌడీలతో ఫైట్లూ... ట్రైలర్ అంతా ఇదే. అనన్య పాండే గ్లామరెస్‌గా కనిపిస్తోంది. హీరో - హీరోయిన్ల మధ్య... టామ్ అండ్ జెర్రీ ఫైట్ నడిచినట్టు అనిపించింది. మరి తెరపై ఈ లవ్ స్టోరీని ఎలా తీసుకొస్తాడో చూడాలి. చివర్లో.. మైక్ టైసన్ ఎంట్రీ అదిరిపోయింది. కౌ బోయ్ గెటప్‌లో మైక్ టైసన్ దర్శనమిచ్చాడు. `ఐ యామ్ ఏ ఫైటర్` అని విజయ్ అంటే `మరి నేనెవరిని` అంటూ.. ఇంగ్లీష్ లో మైక్ టైసన్ రిప్లై ఇచ్చాడు. లైగర్ కీ , మైక్ టైసన్ కీ మధ్య జరిగే ఫైట్... క్లైమాక్స్ కే హైలెట్ అనిపిస్తోంది. విజువల్ గా చాలా గ్రాండ్ గా ఉంది ఈ ట్రైలర్. యాక్షన్ ప్రియులకు నచ్చితే.. బాక్సాఫీసు దుమ్ము దులిపినట్టే.