బిగ్ బాస్ 5 సీజన్ రసవత్తరంగా సాగుతోంది. ఈవారం బిగ్ బాస్ హౌస్‌లో ట్విస్టులే ట్విస్టులు. ప్రతీవారం ఓ ఇంటి సభ్యుడ్ని ఎలిమినేట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ వారం.. లోబో ఎలిమినేట్ అయ్యాడు. కానీ అంతలోనే... పెద్ద ట్విస్ట్ ఇచ్చాడు నాగార్జున.
`ఇంట్లో ఉండడానికి అర్హత లేని సభ్యులెవరు` కంటెస్టెంట్లపై ఓ ప్రశ్న సంధించాడు నాగ్. అందులో ప్రియ, లోబోకు ఎక్కువ ఓట్లు వచ్చాయి. వీరిద్దరిలో ఎవరినో ఒకరిని తేల్చుకోమంటే లోబో వైపే చూపించాయి చాలా వేళ్లు. అలా.. లోబో ఎలిమినేట్ అవ్వాల్సివచ్చింది. దాంతో లోబో కన్నీటి పర్యంతమయ్యాడు. తన దీన గాధ చెప్పి, అందరినీ కదిలించాడు.అంతలో నాగ్ మనసు మారిందేమో.? `నువ్వు ఎలిమినేట్ అవ్వడం లేదు. ఎలిమినేట్ చేసే అవకాశం కేవలం ప్రేక్షకులకే ఉంది.కంటెస్టెంట్లకు లేదు` అని బాంబ్ పేల్చాడు. దాంతో లోబో.. మరింత ఎమోషనల్ అయిపోయాడు. స్టేజీపైనే బోరు బోరున ఏడ్చేశాడు. `సీక్రెట్ రూమ్ లోకి వెళ్లి.. అందరినీ గమనించు` అంటూ.. లోబోకి మరో టాస్క్ ఇచ్చాడు. దాంతో ఎలిమినేషన్ నుంచి లోబో తప్పించుకున్నట్టైంది. మొత్తానికి ఈవారం సందడి సందడిగా జరిగిపోయింది. భావోద్వేగాలు, నవ్వులు, క్లాసులు, ఏడుపులు, కన్నీళ్లతో.. అన్ని రకాల ఎమోషన్లనీ బిగ్ బాస్ వేదిక పైచూసే అవకాశం దక్కింది.