ఈ సంక్రాంతికి వస్తున్నామహో.. అంటూ `సర్కారు వారి పాట` చిత్రబృందం ఎప్పుడో ఓ ప్రకటన ఇచ్చేసింది. సంక్రాంతి రేసులో మొదట నిలిచిన సినిమా అదే. ఆ తరవాతే రాధేశ్యామ్, భీమ్లా నాయక్ లాంటి సినిమాలొచ్చాయి. అయితే ఎప్పుడైతే `RRR` బరిలోకి దిగిందో అప్పుడు సమీకరణాలు మారిపోయాయి. `RRR` కి భయపడి కొన్ని సినిమాలు వెనక్కి వెళ్తాయని చెప్పుకున్నారు. ఆ లిస్టులో ముందుగా తేలిన పేరు.. `సర్కారు వారి పాట`నే. ఈ సినిమా ఏకంగా వేసవికి షిఫ్ట్ అయిపోయిందని వార్తలొచ్చాయి.
అయితే అవన్నీ కేవలం రూమర్లని తేలిపోయింది. ఆదివారం కీర్తి సురేష్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఈ సినిమాలోని కీర్తి సురేష్ లుక్‌ని చిత్రబృందం విడుదల చేసింది. దీనితో పాటు రిలీజ్ డేట్ కూడా ప్రస్తావించింది. జనవరి 13న ఈ సినిమాని విడుదల చేస్తున్నామంటూ క్లారిటీ ఇచ్చింది. సో.. సర్కారు వారి పాట ఎక్కడా తగ్గడం లేదన్నమాట. ఈసినిమా సంక్రాంతికి రావడం ఖాయమైపోయిందన్న మాట. ప్రస్తుతానికైతే... ఈ సినిమా సంక్రాంతి బరిలోనే ఉంది. భవిష్యత్తులో సమీకరణాలు మారినా మారొచ్చు. ఒకవేళ సర్కారు వారి పాట కూడా అనుకున్నట్టే జనవరి 13న వస్తే.. రాధేశ్యామ్, భీమ్లా నాయక్‌లు రెండూ.. వాయిదా పడే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.