నటీనటులు : ప్రియదర్శి, ఆనీ, సయాజీ షిండే తదితరులు
దర్శకత్వం : అభిలాష్ రెడ్డి
నిర్మాణం : జీ 5, అన్నపూర్ణ స్టూడియోస్
సంగీతం : శ్రీరామ్ మద్దూరి
సినిమాటోగ్రఫర్ : నరేష్ రామదురై
లోపం లేని ప్రయత్నం చేస్తే ప్రపంచం మొత్తం మన వెనుక నిలుస్తుంది. "లూజర్" సిరీస్ చూశాక అది అక్షర సత్యమని రుజువవుతుంది. లేకపోతే అసలు ఎలాంటి బంధం లేని సూరి కోసం రూబి తన భర్తకు చెప్పకుండా, అతను స్వీట్ షాప్ పెట్టడం కోసం అప్లై చేసిన పర్సనల్ లోన్ ఎమౌంట్ ఇవ్వడం ఏమిటి?, కన్న కొడుకు హాస్పిటల్ ను పాలయ్యేలా చేసినా విల్సన్ క్షమించి కేస్ వెనక్కి తీసుకొని సూరి నేషనల్స్ గెలవడానికి అడ్డంకిగా ఉన్న దారిని సుగమం చేయడం ఏమిటి?
అసలు ఎవరు వీళ్ళంతా.. సూరికి ఎందుకు సహాయంగా నిలిచారు? అసలు సూరి ఎవరు? వంటి ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే "లూజర్" సిరీస్ చూడాలి. హాస్య నటుడు ప్రియదర్శి ప్రధాన పాత్ర పోషించిన వెబ్ సిరీస్ ఇది. మరి... లూజర్ ప్రయత్నం.. ఎలా సాగింది? తన ప్రయాణంలో ఎదురైన ఒడిదుడుకులేంటి?
*కథ
సూరి (ప్రియదర్శి) ఓ అనాథ. థియేటర్ల బయట పెట్టె హోర్దింగ్స్ పెడుతూ, గోడల మీద పెయింటింగ్స్ వేస్తూనే షూటింగ్ లో ఇండియా తరపున ఆడి పసిడి సాధించాలని తాపత్రయపడుతుంటాడు. నేషనల్స్ కి సెలక్ట్ అయినప్పటికీ.. ఆడేందుకు కావాల్సిన గన్ మరియు ఇతర సామాగ్రి కొరకు 5 లక్షల రూపాయలు సమకూర్చాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఆ డబ్బు సంపాదించడం కోసం నానా ప్రయత్నాలు చేస్తుంటాడు సూరి. ప్రపంచానికి చాలా మంచోడిలా బిల్డప్ ఇస్తూ భార్యను మాత్రం ఒక సెక్స్ స్లేవ్ లా చూసే ఓ ఆధునిక మగాడి చెరలో బందీగా బ్రతికే రూబి (కల్పిక గణేష్). బ్యాడ్మింటన్ లో నేషనల్ లెవల్ కి వెళ్ళి ఆడాల్సిన నెంబర్ 1 ప్లేయర్. కానీ కారణాంతరాల వలన ఇండియా తరుపున మాత్రం ఆడలేకపోతుంది.
స్పొర్ట్స్ కోటాలో బ్యాంక్ ఉద్యోగం సంపాదించి సమాజంలో గౌరవంగా, ఇంట్లో భర్త కాలి కింద చెప్పులా బ్రతుకుతుంటుంది. ఇండియన్ క్రికెట్ టీం కి కెప్టెన్ అవ్వాల్సిన అన్నీ అర్హతలూ ఉన్నప్పటికీ.. కంట్రోల్ చేసుకోలేనంత కోపం కారణంగా జట్టులో స్థానం కోల్పోయి.. జీవితం మీద ఆశ కోల్పోయి, ప్రేమించి పెళ్లాడిన భార్య నమ్మకం పోగొట్టుకుని ఆఖరికి 20 ఏళ్ల కుర్రాడికి ఒంటరి తండ్రిగా, లోకల్ క్రికెట్ ట్రయినింగ్ కోచ్ గా మిగిలిపోతాడు విల్సన్. సూరి నేషనల్ లెవల్ కి వెళ్లడానికి.. రూబి, విల్సన్ ఎలా సహాయపడ్డారు? అసలెందుకు సహాయం చేశారు? సూరి విన్నరా లేక లూజరా అనేది తెలియాలంటే సిరీస్ చూడాల్సిందే.
*విశ్లేషణ
సాధారణంగా సిరీస్ అంటే సినిమాగా తీయలేకపోయిన సబ్జెక్ట్ ని సాగదీసి తీసేస్తారు అనుకుంటాం. కానీ.. "లూజర్" చూస్తే ఆ ఫీలింగ్ రాదు. ఈ కథలో కావల్సినన్ని భావోద్వేగాలున్నాయి. అందరికీ కావల్సిన అంశాలున్నాయి. దర్శకుడు అభిలాష్ రెడ్డి తో పాటు ఈ సిరీస్ కి రచయితలను ఈ విషయంలో మెచ్చుకొని తీరాలి. టీం అందరూ నవతరం కావడంతో మేకింగ్, ప్రొడక్షన్ డిజైన్ సరికొత్తగా ఉంది. వాళ్ళు చెప్పేది, మనం చూసేదీ ఒక సాధారణమైన కథ అయినప్పటికీ.. సగటు ప్రేక్షకులు ఏదో ఒక కోశాన తనను తాను రిలేట్ చేసుకొనేలా ప్రతి పాత్రను తీర్చిదిద్దిన విధానం ఆకట్టుకుంటుంది.
ప్రీప్రొడక్షన్ బాగుంటే.. ప్రొడక్షన్ డిజైన్ ను ఎంత చక్కగా చేసుకోవచ్చనేందుకు "లూజర్" ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ఇక దర్శకుడు అభిలాష్ పాత్రలతో ప్రేక్షకులు ఇంటరాక్ట్ అయ్యేలా క్రియేట్ చేసిన రియలిస్టిక్ సీన్స్ & ఇంటర్ కనెక్టింగ్ స్టోరీ లైన్, ముగ్గురి జీవితాలను ఒకే గమ్యంలోకి తీసుకొచ్చిన కథనం ఆకట్టుకుంటాయి. 10 ఎపిసోడ్ల సిరీస్ ఎక్కడా బోర్ కొట్టలేదంటే అర్ధం చేసుకోవచ్చు.. ఎమోషన్స్ ఎంత చక్కగా పండించాడో, వాటికి ఆడియన్స్ ఎంతగా కనెక్ట్ అయ్యారో అనేది. ఓవరాల్ గా.. "లూజర్" ఒక విజేత కథ, ఆ విజేత వెనుక నిలిచిన ఇద్దరు పరాజయుల వ్యధ.
* నటీనటులు
"బొమ్మల రామారం" సినిమా చూశాక ప్రియదర్శిలో మంచి నటుడు అని కొందరికి తెలిస్తే.. "మల్లేశం"తో ఆ విషయం అందరికీ అర్ధమైంది. అయితే.. కమెడియన్ ముద్ర పడిపోవడంతో అతడిలోని నటుడ్ని పెద్దగా ఎవరూ వినియోగించుకోలేదు. కానీ.. అభిలాష్ రెడ్డి "సూరి" పాత్రకు షూటర్ గా ప్రియదర్శి బాడీ లాంగ్వేజ్ సరిగ్గా సెట్ అవుతుందని ఎంపిక చేసుకోవడం, అతడిలోని నటుడ్ని ప్రేక్షకులకు మరోసారి పరిచయం చేయడంలో విజయం సాధించాడు. ప్రియదర్శి తర్వాత ఆస్థాయిలో ఆకట్టుకున్న నటి కల్పిక గణేశ్. రూబి ఓ సగటు ముస్లిం వైఫ్ గా ఆమె నటన, పాత్ర స్వభావం, వ్యవహారశైలి చాలా మందికి కనెక్ట్ అవుతుంది. ఒక మధ్యతరగతి మహిళ జీవనవిధానానికి ఆమె క్యారెక్టర్ ఒక తార్కాణం.
భర్త ఆమెను తన పైచాచిక కోరికలను తీర్చుకోవడానికి ఒక బానిసలా వాడుకొంటున్నాడని తెలిసినా ఏనాడూ అతడ్ని వారించదు. అతడి పైత్యపు శృంగార కోరికలకు ఏనాడూ అడ్డూ చెప్పదు. కానీ.. సూరిని నేషనల్స్ కి పంపించాలి, తాను సాధించలేకపోయిన బంగారు పతకాన్ని సూరి సాధించాలి అతనికి అండగా నిలిచి ఆమె చూపే తెగువను డ్రమాటిక్ గా కాకుండా రియలిస్టిక్ గా చూపించాడు దర్శకుడు. ఇక విల్సన్ పాత్రకు కు శశాంక్ పర్ఫెక్ట్ గా సెట్ అయ్యాడు. సపోర్టింగ్ రోల్స్ లో షాయాజీ షిండే తదితరులు పాత్రలకు న్యాయం చేశారు. కెమెరా వర్క్ & లైటింగ్ ను ప్రశంసించాలి. ఒక చక్కని మూడ్ క్రియేట్ చేయడంలో అవి పోషించిన పాత్రను గొప్పది. అలాగే బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా.
* ప్లస్ పాయింట్స్
కంటెంట్
ఎమోషన్స్
నటీనటుల ప్రతిభ
* మైనస్ పాయింట్స్
కొన్ని చోట్ల అనవసరమైన సాగదీత
* ఫైనల్ వర్డిక్ట్: నిజమైన విజేత