లవ్ మీ మూవీ రివ్యూ & రేటింగ్

మరిన్ని వార్తలు

చిత్రం: లవ్ మీ 'ఇఫ్ యు డేర్'
నటీనటులు: ఆశిష్, వైష్ణవి చైతన్య

దర్శకత్వం: అరుణ్ భీమవరపు 
నిర్మాతలు: హర్షిత్ రెడ్డి, హన్షిత, నాగ మల్లిడి
 
సంగీతం: ఎం.ఎం.కీరవాణి 
ఛాయాగ్రహణం: పీసీ శ్రీరామ్
కూర్పు: సంతోష్ కామిరెడ్డి

బ్యానర్స్: దిల్ రాజు ప్రొడక్షన్స్
విడుదల తేదీ: 25 మే 2024

 
ఐక్లిక్ మూవీస్ రేటింగ్‌: 1.5/5


దిల్ రాజు వారసుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఆశిష్ హీరోగా నిలదొక్కుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. 2022 లో మొదటి ప్రయత్నంగా రౌడీ బాయ్స్  అనే సినిమాతో వచ్చాడు. నటనాపరంగా పరవాలేదు అనిపించుకున్నాడు. మళ్ళీ రెండేళ్ల తరవాత లవ్ మీ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇందులో బేబీ ఫేమ్ వైష్ణవీ చైతన్య హీరోయిన్ గా నటించింది. దెయ్యంతో ప్రేమలో పడే హీరో కథతో తెరకెక్కిన లవ్ మీ సినిమా పై మొదటి నుంచి ఆసక్తి నెలకొంది. టీజర్, ట్రైలర్స్ తో మరింతగా అంచనాలు పెరిగాయి. If You Dare అని కింద హెచ్చరికలాంటి  క్యాప్షన్ కూడా ఇచ్చారు. మే 25న థియేటర్స్ లో రిలీజ్ అయిన ఈ సినిమా ప్రేక్షకుల్ని మెప్పించిందో లేదో చూద్దాం. 


కథ: రామ‌చంద్ర‌పురం అనే ఓ ఊరు. ఆ ఊర్లోని ఓ ఇంటిలోంచి ప్రతి రోజు పెద్ద అరుపులు, ఏడుపులు వినిపిస్తాయి. ఆ ఇంటిని చూసి ఊరి వాళ్ళు భయపడుతుంటారు. ఆ ఇంట్లో ఒక ఫ్యామిలీ ఉంటుంది. తల్లి నిప్పు అంటించుకొని చనిపోతుంది. తండ్రి కూడా చనిపోతాడు. వాళ్ళ  పాప ఒక్కతే బతికి ఉంటుంది. కట్ చేస్తే అర్జున్ (ఆశిష్), ప్రతాప్(రవికృష్ణ) కలిసి ఓ యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తారు. కొంచెం డిఫరెంట్ గా ప్లాన్ చేసి రియాలిటీగా ఉండాలని, దెయ్యాలు, ఆత్మలు, స్మశానాలు లాంటి వాటికి సంబంధించిన వీడియోలు షూట్ చేసి యూట్యూబ్ లో పోస్ట్  చేస్తారు. ప్రతాప్ గర్ల్ ఫ్రెండ్ అయిన  ప్రియ (వైష్ణవి చైతన్య) కూడా వీరితో కలుస్తుంది. ఓ రోజు రామచంద్ర పురంలో ఉన్న  పాప గూర్చి ఎవరికీ తెలియని న్యూస్ అర్జున్ కి తెలుస్తుంది. ఆ పాప పెద్దయ్యాక చనిపోయిందని, చనిపోయిన తరవాత దివ్యవతి అనే దయ్యంలా మారి తనని చూడటానికి వెళ్లిన వాళ్ళని చంపేస్తుందని ప్రియ చెప్తుంది. అసలు విషయం తెలుసుకోవటానికి అర్జున్ ఆ ఊరు వెళ్తాడు. తీరా వెళ్ళాక అర్జున్ ఆ దెయ్యంతో ప్రేమలో పడతాడు. తర్వాత అసలు ఆ అమ్మాయి ఎవరు, ఎలా చనిపోయింది, అనే వివ‌రాలు కనుక్కునే ప్రయత్నం మొదలుపెడతాడు. ఆ క్రమంలో అనేక విషయాలు బయట పడతాయి. ఒక్క దివ్యవతే కాదు చాలా మంది అమ్మాయిలు చనిపోయినట్టు తెలుస్తుంది. వాళ్ళకి దివ్యవతికి లింక్ ఏంటి, దివ్యవతి ఒక్కతే ఎందుకు దెయ్యంగా మారింది, కారణం ఏంటి, అసలు దివ్యవతి ఎవరు? ఆ పాప ఎవరు? చనిపోయిన ఆ ముగ్గురు అమ్మాయిలు ఎవరు? అసలు ఎలా చనిపోయారు? అర్జున్ దెయ్యాన్ని ఎందుకు ప్రేమించాడు? దయ్యం అర్జున్ ని ఏం చేసింది? ప్రతాప్ గర్ల్ ఫ్రెండ్ అయిన ప్రియ అర్జున్ తో  ఎందుకు, ఎలా ప్రేమలో పడింది? అసలు ప్రతాప్, అర్జున్ ఎవరు? అనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే. 


విశ్లేషణ: దర్శకుడు ఏం తీద్దామనుకుని మొద‌లెట్టి చివ‌రికి ఏం తీసాడని ప్రశ్న మొదలవుతుంది ఈ సినిమా చూస్తే. హారర్ జోనర్ అని ఏ జోనర్ కి చెందకుండా తెరకెక్కించాడు. సినిమా మొదటినుంచి హారర్ అని ఊదరగొట్టి అసలు ఆ ప్రయత్నమే చేయలేదు. కామెడీ సీన్స్ లేవు, లవ్ స్టోరీ, మర్డర్ మిస్టరీ ఆకట్టుకునేలా లేదు. ప్రేక్షకుడి ఊహకందని ట్విస్ట్ లు ఏమి లేవు సరికదా నెక్స్ట్ ఏం జరుగుతుందో ముందే ఊహించవచ్చు. అసలు దెయ్యం తో ప్రేమ, రొమాన్స్, డేటింగ్ ఇవన్నీ బెడిసికొట్టే అంశాలే. పోనీ వాటిని కామెడీగా కూడా చిత్రించలేకపోయారు. ప్రేక్షకుడి సహనానికి పరీక్ష పెట్టే విధంగా ఉన్నాయి సీన్స్. సినిమా మొదటి భాగంలో అర్జున్, ప్రతాప్, ప్రియల యూట్యూబ్ షూట్స్, దివ్యవతి గురించి  తెలిసి ఆమెను వెతుకుతూ వెళ్లడం, అక్కడ దెయ్యంతో సీన్స్  సాగదీత లా ఉంటుంది. సెకండ్ హాఫ్ లో ఓ ముగ్గురు అమ్మాయిల గురించి, దివ్యవతి గురించి అర్జున్ చేసే రీసెర్చ్, కొన్ని సీన్స్ కథపై ఆసక్తి కలిగించక పోగా అంతా గందరగోళంగా ఉంటుంది. లాజిక్స్ లేని సీన్లు చాలా ఉన్నాయి. చివ‌ర్లో సెకండ్ పార్ట్ కూడా ఉందని ఒక హింట్ ఇచ్చారు. హార‌ర్ సినిమా అన‌గానే భ‌య‌పెట్టే ఎలిమెంట్స్ ఉంటాయ‌నుకొంటారంతా. అయితే ఈ సినిమా అందుకు పూర్తి విరుద్ధం. ఒక్క‌టంటే ఒక్క చోట కూడా భ‌యం అనే ఫీలింగ్ క‌ల‌గ‌దు. పాత్ర‌లు, వాటి మ‌ధ్య అనుబంధం, వాటి ప్ర‌వ‌ర్త‌న‌.. అన్నీ గంద‌ర‌గోళంగానే అనిపిస్తాయి. సెకండాఫ్‌లో జ‌రిగే ఇన్వెస్టిగేష‌న్ సామాన్యులకైతే అర్థం కాదు, మినిమం డిగ్రీ ఉండాలి అన్న‌ట్టుంటుంది.


నటీనటులు: మొదటి సినిమాతో ఏం సాదించలేకపోయాను అన్న నిరాశతో ఉన్న ఆశిష్ కి మళ్ళీ అదే నిరాశ మిగిలింది. తన నటన పరంగా పరవాలేదనిపించినా, కథలో బలం లేకపోవటం వ‌ల్ల త‌న పాత్ర కూడా తేలిపోయింది. సొంత బ్యానర్ ఉంది కనక సినిమా ఛాన్స్ లకి ఏం ప్రమాదం లేదు. కాక‌పోతే త‌న‌కు త‌గిన క‌థ‌లు ఎంచుకోవాలి. హీరోయిన్ వైష్ణవి చైతన్య బేబీ సినిమాతో తన నటనతో ఆకట్టుకుని ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది.  స్వయంగా మెగాస్టార్ చిరంజీవి లాంటి గొప్ప స్టార్  వైష్ణవీ నటనని జయసుధతో పోల్చాడు. కానీ ఈ సినిమాలో అంతగా స్కోప్ లేని పాత్ర చేసి ఎందుకు ఒప్పుకుంది అనిపిస్తుంది. మిగతావారికి  నటించే అంత అవకాశం రాలేదు. వైష్ణవీతో పటు మరో ముగ్గురు ఉన్నా సినిమాపై  పెద్దగా ఇంపాక్ట్ చూపలేదు. 


టెక్నికల్ గా: కీరవాణి సంగీతం బావుంది. కొత్తగా ఉంది. సినిమాలో లేని హారర్ ఎలిమెంట్స్ ని మ్యూజిక్ తో కవర్ చేయటానికి ప్రయత్నం చేశారు. PC శ్రీరామ్ లాంటి బెస్ట్ సినిమాటోగ్రాఫర్ 'లవ్ మీ' లో మెప్పించలేకపోయాడు. దర్శకుడి చేయలేనిది నేనేందుకు చేయాలనీ లైట్ తీసుకున్నట్టు అనిపించింది.  ఓ విష‌యంలో ద‌ర్శకుడ్ని మెచ్చుకోవాలి. ఏమి లేని కథని సినిమాగా తీసి, కీరవాణి, PC  శ్రీ రామ్ లాంటి గొప్పవాళ్ళని ఒప్పించి ఈ ప్రాజెక్ట్ లో భాగం చేసినందుకు.


ప్లస్ పాయింట్స్
కీరవాణి 
ఆర్ట్ విభాగం


మైనస్ పాయింట్స్
కథ 
దర్శకుడు


ఫైన‌ల్ వ‌ర్డిక్ట్‌: ద‌మ్ముంటే చూడు..!


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS