సెకండ్ వేవ్ తరవాత తెలుగు చిత్ర సీమ చూసిన అతి పెద్ద విజయం.... లవ్ స్టోరీ. ఆ మాటకొస్తే యావత్ భారతదేశంలోనే సెకండ్ వేవ్ తరవాత ఇలాంటి హిట్ లేదు. ఎందుకంటే.. తెలుగులో తప్పితే, ఇంకెక్కడా సినిమా చూడ్డానికి ప్రేక్షకులు సిద్ధంగా లేరు. బాలీవుడ్ లో థియేటర్లు పూర్తిగా తెరచుకోలేదు. మిగిలిన చోట్ల థియేటర్లు తెరచినా ప్రేక్షకులు లేరు. కానీ తెలుగులో మాత్రం... కాస్త ఊపు వచ్చింది. దానికి లవ్ స్టోరీ వసూళ్లే సాక్ష్యం. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన చిత్రం లవ్ స్టోరీ.
యూత్ ఫుల్ కథ కావడం, కుటుంబ ప్రేక్షకులకూ శేఖర్ కమ్ములపై గురి ఉండడంతో, ఈ సినిమాపై ఫోకస్ పడింది. దానికి తగ్గట్టే ఓపెనింగ్స్ అదిరాయి. తొలి మూడు రోజుల్లోనే సింహభాగం వసూలు చేసింది. తొలి వారంలో దాదాపు 30 కోట్లకు దగ్గరైంది. లవ్ స్టోరీ బడ్జెట్ దాదాపుగా 35 కోట్లని సమాచారం. మరో 5 కోట్లు వస్తే టార్గెట్ రీచ్ అవుతుంది. అయితే నాన్ థియేటరిల్ రైట్స్ రూపంలో దాదాపుగా 22 కోట్లు వచ్చాయి. అంటే.. ఇప్పటికి 52 కోట్లన్నమాట. దాదాపు 12 కోట్ల లాభాలు ఇప్పటికి జేబులో వేసుకున్నట్టే. రెండో వారంలోనూ లవ్ స్టోరీ నిలకడైన వసూళ్లు రాబడితే.... కనీసం 20 కోట్ల లాభం కళ్ల చూసినట్టు అవుతుంది.