రిపబ్లిక్ వేడుకలో.... పవన్ గొంతు చించుకుని చేసిన వ్యాఖ్యలకు, లేవనెత్తిన విలువైన ప్రశ్నలకు ఇప్పుడు విలువ లేకుండా పోయింది. టాలీవుడ్ పై ఏపీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పవన్ గళం ఎత్తిన సంగతి తెలిసిందే. దాంతో ఏపీ మంత్రులు పవన్ ని టార్గెట్ చేశారు. పోసాని రంగంలోకి దిగి - చేసిన రచ్చ తెలిసిందే. దాంతో ఏపీ ప్రభుత్వం ఒక వైపు, పవన్ ఒక వైపు అన్నట్టు తయారైంది పరిశ్రమ.
టాలీవుడ్ నుంచి పవన్ కి మద్దతు లభించాల్సిన వేళ.. తిరిగి పవన్ ని ఒంటరి చేయడానికి టాలీవుడ్ సైతం ఓ చేయి వేస్తున్నట్టు అనిపిస్తోంది. `దేహీ.. `అంటూ నిర్మాతలే.. చేతులెత్తి మొక్కడం, మీరే దిక్కు - ఆదుకోండి అని ఏపీ ప్రభుత్వాన్ని వేడుకోవడం - షాకిచ్చే అంశాలే. పవన్ వ్యాఖ్యలకూ మాకూఎలాంటి సంబంధం లేదని ఫిల్మ్ ఛాంబర్ ఓ ప్రకటన చేసి షాకిచ్చింది. దానికి తోడు.. నిర్మాతలంతా కలిసి, ఏపీ వెళ్లి, మంత్రుల్ని ప్రసన్నం చేసుకుని వచ్చారు.
పవన్ వ్యాఖ్యల్ని పట్టించుకోవద్దని ప్రాధేయపడడం చూశాం. లవ్ స్టోరీ సక్సెస్ మీట్ లో నాగార్జున సైతం... ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు తమకు చాలా సాయం చేస్తున్నాయని కితాబు ఇచ్చారు. ఇప్పుడు అల్లు అరవింద్ గొంతు విప్పారు. పరిశ్రమలో చాలా సమస్యలున్నాయని వాటిని త్వరగా పరిష్కరించాలని సీఎం జగన్‌ను కోరారాయన. అంతేనా..? రాజు తలచుకుంటే వరాలకు కొదవా అన్నారు అల్లు అరవింద్. కరోనా నుంచి ప్రజలను గట్టెక్కించినట్టే.. టాలీవుడ్‌నూ ఆదుకోవాలని కోరారు.
ఈ వ్యాఖ్యలన్నీ పవన్ ని ఒంటరి వాడ్ని చేయడానికే అన్నది సుస్పష్టం. నిర్మాతలు తమ హక్కుల్ని దక్కించుకోవాలని, అందుకోసం పోరాటం చేయాలని పిలుపు ఇస్తే - `మాకు మీరు తప్ప మరో దిక్కులేదు` అన్నట్టు ప్రవర్తిస్తున్నారు నిర్మాతలు. ఇలాగైనా ఏపీ ప్రభుత్వం దిగి వస్తుందా? లేదంటే - ఎలాగూ కాళ్ల కిందే ఉన్నారని ఇండ్రస్ట్రీని మరింత తొక్కి పడేస్తుందా? చూడాలి.