థియేటర్లు తెరచుకుంటే బాగుండును అని ఎదురు చూస్తున్న సినిమాల్లో `లవ్ స్టోరీ` ఒకటి. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందిన చిత్రమిది. నాగచైతన్య - సాయి పల్లవి జంటగా నటించారు. చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. మరో 10 రోజులు ఆగితే షూటింగ్ పూర్తవుతుంది. దసరా సందర్భంగా థియేటర్లు తెరచుకుంటాయని భావించారు. కానీ... ఆ అవకాశం కనిపించడం లేదు. దీపావళికి సైతం థియేటర్లు తెరచుకుంటాయన్న నమ్మకం లేదు. దాంతో సంక్రాంతి వరకూ ఆగాల్సిన పరిస్థితి వచ్చింది.
శేఖర్ కమ్ముల కూడా తమ సినిమాని సంక్రాంతికే విడుదల చేద్దామనుకుంటున్నారు. కానీ... సినిమాలన్నీ సంక్రాంతి కోసమే ఎదురు చూస్తూ కూర్చుంటే... గట్టి పోటీని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ పోటీని శేఖర్ కమ్ముల సినిమా తట్టుకుంటాందా? అనే సందేహాలున్నాయి. సంక్రాంతి వరకూ ఆగాలంటే కొంచెం కష్టమే. అందుకే ఈ సినిమాని ఓటీటీకి ఇచ్చేస్తే బాగుంటుందన్న ఆలోచనలో ఉన్నట్టు టాక్. ఇది వరకే లవ్ స్టోరీకీ ఓటీటీ ఆఫర్లు చాలా వచ్చాయి.
కానీ శేఖర్ కమ్ముల స్పందించలేదు. దసరాకి ఎలాగూ థియేటర్లు తెరుస్తారని కాచుకుని కూర్చుకున్నారు. ఇప్పుడా అవకాశం కూడా తప్పిపోయింది. అందుకే ఓటీటీ కి ఇచ్చే విషయమై తర్జన భర్జనలు మొదలయ్యాయని తెలుస్తోంది. ఓటీటీ ఆఫర్ మరీ టెమ్టింగ్ గా ఉంటే మాత్రం.. ఓటీటీకి ఇచ్చేయాలని భావిస్తున్నార్ట. ఈ విషయమై ఓ వారంలోగా క్లారిటీ వచ్చే అవకాశం వుంది.