లవ్ స్టోరీల్ని తెరకెక్కించడంలో శేఖర్ కమ్ములది ఓ సెపరేట్ స్టైల్. ఆయన కథలేం కొత్తగా ఉండవు. కానీ అత్యంత సహజంగా ఉంటాయి. `ఫిదా`లో ఆ సహజత్వమే జనాలకు నచ్చింది. ఇప్పుడు `లవ్ స్టోరీ`లోనూ తన మార్క్ చూపించాలనుకుంటున్నారాయన. నాగచైతన్య - సాయి పల్లవి జంటగా నటించిన చిత్రమిది. లాక్ డౌన్ కి ముందే సినిమా పూర్తయ్యింది. కానీ కరోనా వల్ల విడుదల ఆలస్యమైంది. ఈలోగా చాలాసార్లు రిలీజ్ డేట్ ప్రకటించారు. కానీ పరిస్థితులు అనుకూలించక వాయిదా వేస్తూ వచ్చారు. ఎట్టకేలకు ఈనెల 24న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. ఇప్పుడు ట్రైలర్ ని రిలీజ్ చేశారు.
డాన్సంటే ప్రాణంగా బతికే ఓ అబ్బాయి, ఏదో ఓ ఉద్యోగం సంపాదించి, ఇంటిని చూసుకోవాలనుకునే ఓ అమ్మాయి మధ్య జరిగే కథ ఇది. అమ్మాయిలోనూ మంచి డాన్సర్ ఉందని గ్రహించి - ఆమెను డాన్సర్ చేయాలని చూస్తాడు అబ్బాయి. వాళ్ల మధ్య ఏం జరిగింది? ఈ ప్రేమకథకి విలన్లు ఎవరన్నది మిగిలిన సినిమా. డైలాగులు, టేకింగ్.. ఇవన్నీ శేఖర్ కమ్ముల శైలిలో సహజంగా సాగాయి.
'బీటెక్ బీటెక్కే.. డ్యాన్స్ డ్యాన్సే.. బిల్ గేట్స్ వచ్చి ప్రభుదేవా ని తన జాబ్ అడిగితే దొబ్బేయ్ అంటాడు..' 'మనకు లోన్లు ఇవ్వరు.. రెంటుకు రూములు ఇవ్వరు.. పిల్లనిస్తార్రా' 'బతుక్కోసం ఈ ఉరుకులాట నాతో కాదింక.. చస్తే చద్దాం.. కానీ తేల్చుకొని చద్దాం' వంటి డైలాగ్స్ ఈ ట్రైలర్లో వినిపించాయి. చై- పల్లవిల జంట చూడ ముచ్చటగా కనిపిస్తోంది. దాంతో పాటు ఎమోషన్స్ ని కూడా బాగా దట్టించినట్టు అర్థమవుతోంది. మొత్తానికి హిట్ లక్షణాలు లక్షణంగా కనిపించేలా కట్ చేసిన ట్రైలర్ ఇది. ఫైనల్ రిజల్ట్ ఎలా ఉంటుందో?