స్టార్ హీరోలు, హీరోయిన్లు... వాణిజ్య ప్రకటనల్లో నటించడం చాలా సహజం. అది వాళ్లకు మరో ఆదాయ వనరు. కేవలం యాడ్ల రూపంలోనే కోట్లు సంపాదించేవాళ్లు చాలామంది ఉన్నారు. కానీ ఎలాంటి ప్రకటనల్లో నటించాలి? ఎలాంటి ప్రకటనలకు దూరంగా ఉండాలి? అనే విషయంలో సదరు స్టార్లకు స్పష్టత ఉండాలి. శీతల పానియాల్లో క్రిమిసంహారక అవశేషాలున్నాయన్న అభియోగాలు రావడంతో చాలామంది స్టార్లు... కూల్ డ్రింక్స్ యాడ్స్ లో నటించడానికి ఒప్పుకోలేదు. మద్యపానం, ధూమపానాన్ని ప్రోత్సహించే ప్రకటనల్లో చేయడానికి చాలామంది సంశయిస్తారు. ఎందుకంటే... ఆయా హీరోల్ని, హీరోయిన్లని అభిమానించే వాళ్లపై అది పరోక్ష ప్రభావాన్ని చూపిస్తుంది. దానికి తోడు మద్యపాన, ధూమపాన, గుట్కా ప్రకటనల్ని ప్రభుత్వం నిషేధించింది కూడా. అయితే ఆయా బ్రాండ్లని మాత్రం విరివిగా ప్రమోట్ చేస్తుంటారు.
అందులో భాగంగా మహేష్ బాబు సైతం.. పాన్ బహార్ యాడ్ లో నటించారు. అది విడుదలై... వైరల్ అయ్యింది కూడా.
పాన్ బహార్ మౌత్ ఫ్రెషనర్ అని చెబుతారు కానీ, అది గుట్కా. గుట్కాల అమ్మాకాన్ని ప్రభుత్వం నిషేధించింది. అయినా సరే.. యదేఛ్ఛగా అమ్మేస్తుంటారు. అంటే ఈ యాడ్ తో ఓ రకంగా గుట్కాల వాడకాన్ని సమర్థించినట్టే. దాంతో మహేష్ బాబుపై విమర్శలు మొదలయ్యాయి. మహేష్ కి డబ్బులే ముఖ్యమా.? డబ్బుల సంపాదన కోసం ఏమైనా చేస్తాడా? అంటూ సోషల్ మీడియాలో విమర్శలు గట్టిగా గుప్పిస్తున్నారు. దాన్ని యాంటీ మహేష్ బాబు ఫ్యాన్స్ బాగా వాడుకుంటున్నారు. శీతల పానియాల ప్రకటనల్లో నటించడానికి చాలామంది స్టార్లు మొహమాట పడుతున్నా మహేష్ `ధమ్సప్` యాడ్ లో నటించాడు. అంటే... మహేష్ కి డబ్బులే ముఖ్యం కదా... ? అని యాంటీ మహేష్ ఫ్యాన్స్ ఆడేసుకుంటున్నారు.