లక్కున్నోడు మూవీ రివ్యూ

మరిన్ని వార్తలు

తారాగణం: మంచు విష్ణు, హన్సిక, ఎం. వి. వి సత్యనారాయణ
బ్యానర్: ఎం వి వి సినిమా
మ్యూజిక్ డైరెక్టర్స్: అచ్చు & ప్రవీణ్
సినిమాటోగ్రఫీ: పీజి విందా
రైటర్: డైమండ్ రత్న బాబు
ప్రొడ్యూసర్: ఎం. వి. వి. సత్యనారాయణ
డైరెక్టర్: రాజ్ కిరణ్

'య‌ముడు 3' వాయిదా ప‌డ‌డంతో... విష్ణుకి 'ల‌క్‌' క‌లిసొచ్చింది. దాంతో ఫిబ్ర‌వ‌రి 3న రావాల్సిన త‌న సినిమాని ముందే వ‌దిలేశాడు.. అదే ల‌క్కున్నోడు!  ఎంట‌ర్‌టైన్ మెంట్ సినిమాల‌ జ‌మానా న‌డుస్తోంది. బాగా న‌వ్విస్తే చాలు.. లాజిక్ లేక‌పోయినా ప‌ట్టించుకోరు. హీరో ఎవ‌రైనా ప‌ట్టం క‌ట్టేస్తారు. విష్ణుకి విజ‌యాల్ని అందించిన‌వి కూడా వినోదాత్మ‌క చిత్రాలే. ఢీ, దేనికైనా రెడీ, ఈడోర‌కం, ఆడోర‌కం... ఇవ‌న్నీ ఫ‌క్తు వినోదాత్మ‌క చిత్రాలే. 'ల‌క్కున్నోడు' ట్రైల‌ర్ చూస్తే చాలు.. విష్ణు మ‌ళ్లీ ఆ 'పాత‌' ఫార్ములానే న‌మ్ముకొన్నాడ‌న్న న‌మ్మ‌కం క‌లుగుతుంది. మ‌రి ఈ ల‌క్కున్నోడు ఎలా ఉన్నాడు??   తాను న‌మ్ముకొన్న ఎంట‌ర్‌టైన్‌మెంట్‌... విష్ణుని గెలిపించిందా?  ల‌క్కున్నోడు క‌థేంటి?  తెలియాలంటే రివ్యూలోకి వెళ్లాల్సిందే.

* క‌థ‌

రిజ‌ర్వ్ బ్యాంకు నుంచి బ్యాంకుల‌కు స‌ర‌ఫ‌రా అవుతున్న రూ.25 కోట్ల నోట్ల‌ని కాచేయాల‌ని ప్ర‌య‌త్నం చేస్తాడు జీకే. త‌న ప్లాన్ ప్ర‌కారం ఆంటోనీ ఆ సొమ్ము కాజేస్తాడు. అయితే... జీకేకి వాటా ఇవ్వ‌కుండా ఆ డ‌బ్బుతో ప‌రార‌వుతాడు. అప్ప‌టి నుంచీ.. ఆంటోనీ కోసం జీకే వేటాడుతుంటాడు. మ‌రోవైపు... ల‌క్కీ (విష్ణు) క‌థ న‌డుస్తుంటుంది. తన పేరులో త‌ప్ప జీవితంలో ఎలాంటి ల‌క్ లేని కుర్రాడ‌త‌డ‌ను. పుట్టిన‌ప్ప‌టినుంచీ నాన్న (జ‌య ప్ర‌కాష్‌)కి క‌ష్టాలు ఎదుర‌వుతుంటాయి. అందుకే క‌నీసం ల‌క్కీని పేరు పెట్టి కూడా పిల‌వడు. ల‌క్కి ఉద్యోగం కోసం హైద‌రాబాద్ వ‌స్తాడు. ఇక్క‌డ పాజిటీవ్ ప‌ద్మావ‌తి (హ‌న్సిక‌)ని తొలి చూపులోనే ప్రేమిస్తాడు. ముందు `నో` చెప్పినా ప‌ద్దూ కూడా ల‌క్కీని ఇష్ట‌ప‌డ‌డం మొద‌లెడుతుంది. అయితే ఈలోగా ల‌క్కీ చెల్లాయి పెళ్లి ఫిక్స‌వుతుంది. క‌ట్నం డ‌బ్బు ఇవ్వ‌డానికి లక్కీ త‌న చెల్లెలు మామ‌గారికింటికి వెళ్తాడు. అయితే దారిలో బ్యాగులు మారిపోవ‌డం వ‌ల్ల పాతిక ల‌క్ష‌లు డ‌బ్బు పోతుంది. చెల్లాయి పెళ్లి ఆగిపోతుంది. తండ్రి ముందు మ‌రోసారి ఓడిపోతాడు ల‌క్కీ. ఆ బాధ భ‌రించ‌లేక చ‌నిపోదామ‌ని ఫిక్స‌వుతాడు. ఈలోగా.. ల‌క్కీ జీవితం తారు మారు  అవుతుంది. ఆంటోనీ త‌న ద‌గ్గ‌రున్న పాతిక కోట్లు ల‌క్కీ చేతిలో పెట్టి చ‌నిపోతాడు. పాతిక కోట్లు ల‌క్కీకే ఇవ్వ‌డానికి కార‌ణం ఏమిటి?  ఆ డ‌బ్బు చేతికి చిక్కాక ల‌క్కీ జీవితం ఎలా మారిపోయింది?  అనేదే క‌థ‌. 

* న‌టీన‌టుల ప్ర‌తిభ‌

విష్ణు కామెడీ టైమింగ్‌లో మార్పు క‌నిపిస్తుంది. కానీ ఆ మార్పు... మ‌రీ ఓవ‌ర్ అనిపిస్తుంది. త‌న‌కంటూ ఓ సొంత బాడీ లాంగ్వేజ్‌ని బిల్డ‌ప్ చేసుకోవడం మంచిది. చాలా స‌న్నివేశాల్లో మోహ‌న్ బాబుని ఇమిటేట్ చేయ‌డానికి ప్ర‌య‌త్నించాడు. కాక‌పోతే ఈ సినిమాలో చూడ‌గ‌లిగింది ఏమైనా ఉందంటే... అది విష్ణునే. హ‌న్సిక బాగా ముదిరిపోయింది. విష్ణుతో ఏమాత్రం మ్యాచ్ కాలేదు. మేక‌ప్ కూడా మ‌రీ ఓవ‌ర్ గా ఉంది. జ‌య‌ప్ర‌కాష్‌, భ‌ర‌ణి లాంటి న‌టుల్ని ఎంచుకొన్నా.. వాళ్ల‌కు స‌రైన పాత్ర‌లు ఇవ్వ‌లేదు. విల‌న్‌ని ఎక్క‌డి నుంచి ప‌ట్టుకొచ్చారో గానీ.. ఆయ‌నే ఈ సినిమాకి ప్ర‌ధాన మైన‌స్‌గా మారాడు. స‌త్యం రాజేష్ కామెడీ ఆక‌ట్టుకొంది. వెన్నెల కిషోర్ క‌నిపించింది కాసేపే. కానీ.. న‌వ్వించాడు. ఓ పాట‌లో మోహ‌న్‌బాబు క‌నిపించ‌డం మంచు అభిమానుల‌కు న‌చ్చుతుంది.

* విశ్లేష‌ణ‌

కాస్త క్రైమ్ కామెడీ జోన‌ర్‌లో సాగే సినిమా ఇది. విల‌న్ వెదుకుతున్న డ‌బ్బు లేదా నిధి.. హీరో చేతికి చిక్క‌డం... అక్క‌డి నుంచి హీరో విల‌న్ల మ‌ధ్య టామ్ అండ్ జెర్రీ ఆట సాగ‌డం చాలా సినిమాల్లో చూశాం. ఇదీ అలాంటి క‌థే.  హీరో ఆత్మ హ‌త్య ఎపిసోడ్ నుంచి క‌థ మొద‌ల‌వుతుంది. త‌న ఫ్లాష్ బ్యాక్ ఓ దొంగ‌కు చెప్ప‌డం ప్రారంభిస్తాడు. సో.. టేకాఫ్ కాస్త కొత్త‌గానే ఉంటుంది. కానీ... స‌న్నివేశాలు గ‌డుస్తున్న కొద్దీ పాత సినిమాల వాసన కొట్ట‌డం మొద‌ల‌వుతుంది. హీరో బ్యాడ్ ల‌క్‌ని తెర‌పై చూపించే స‌న్నివేశాలు బాగానే పండాయి. దాంతో ఫ‌న్ వ‌ర్కవుట్ అయ్యింది. వెన్నెల కిషోర్ త‌న పిచ్చ పిచ్చ డౌట్ల‌తో కాసేపు న‌వ్విస్తాడు. పాజిటీవ్ ఫ్యామిలీ (ఈ ఎసిసోడ్ రేసు గుర్రం సినిమా నుంచ ఎత్తేసిన విష‌యం గ‌మ‌నించ‌గ‌ల‌రు) కూడా ఓకే అనిపిస్తుంది. దాంతో ఫ‌స్టాఫ్‌లో క‌థేం లేక‌పోయినా కాల‌క్షేపానికి ఢోకా లేకుండా సాగింది. విష్ణు, హ‌న్సిక‌ల ల‌వ్ ట్రాక్ బాగా బోర్ కొట్టించింది. స‌రిగ్గా ఇంట్ర‌వెల్ ముందు పాతిక కోట్ల బ్యాగ్ హీరో చేతికి చిక్క‌డంతో క‌థ ర‌స‌ప‌ట్టులో సాగిన ఫీలింగ్ వ‌స్తుంది. కానీ.. అంత‌లోనే ప‌ట్టు త‌ప్పేస్తుంది. హీరో చేతిలో డ‌బ్బున్న సంగ‌తి విల‌న్‌కి తెలిసిపోతుంది. అక్క‌డి నుంచి... సినిమాలో ఎలాంటి ఉత్కంఠ‌త గానీ, థ్రిల్ క‌లిగించే స‌న్నివేశాలు గానీ ఉండ‌వు.  మ‌ధ్య‌లో పోసానికి కాసేపు బ‌క‌రాని చేసి ఆడుకోవ‌డం మిన‌హా.. హీరోగారు చేసిందేం లేదు. హీరో విల‌న్ల మ‌ధ్య గేమ్ స‌రిగా పండ‌లేదు. వార్ వ‌న్ సైడ్ అయిపోయింది. పైగా విల‌న్ మ‌రీ డ‌మ్మీ అయిపోయాడు. ఫోన్లో బెదిరించ‌డం, పాత సినిమాలో విల‌న్‌గా.. హీరోయిన్‌ని కిడ్నాప్ చేయ‌డం మిన‌హా.. ఆయ‌న గారు చేసిందేం లేదు. తండ్రీ కొడుకుల మ‌ధ్య ఎమోష‌న్‌ని బ‌లంగా చూపించే ఛాన్స్ ఉన్నా.. ద‌ర్శ‌కుడు ఆ సంగ‌తి మ‌ర్చిపోయాడు. ప‌తాక స‌న్నివేశాలు ఈ సినిమా ఎంత రొటీన్‌నో.. అన్న విష‌యాన్ని ప‌దే ప‌దే గుర్తు చేస్తుంటాయి.

* సాంకేతిక వ‌ర్గం

అందరి కంటే ఎక్కువ మార్కులు మాట‌ల ర‌చ‌యిత డైమండ్ ర‌త్న‌బాబుకి ప‌డ‌తాయి. అలాగ‌ని సూప‌ర్ పంచ్‌లేం రాయ‌లేదు. విన్నంత వ‌ర‌కూ ఓకే అనిపిస్తాయి. పాట‌లేవీ క్యాచీగా లేవు. నేప‌థ్య సంగీతం అయితే హార‌ర్ సినిమా చూసొచ్చిన ఫీలింగ్ క‌లుగుతుంది. కెమెరా వర్క్ వ‌ల్ల సినిమా క్వాలిటీగా క‌నిపించింది. గీతాంజ‌లితో ఆక‌ట్టుకొన్న రాజ‌కిర‌ణ్‌... స్క్రిప్ట్ పై మ‌రింత వ‌ర్క్ చేయాల్సింది. అక్క‌డ‌క్క‌డ త‌న‌దైన మార్క్ క‌నిపించినా.. ఓవ‌రాల్‌గా ఫెయిల్ అయ్యాడు.

*ప్ల‌స్ పాయింట్స్‌

- ఫ‌స్ట్ ఆఫ్‌
- పంచ్‌లు

* మైన‌స్ పాయింట్స్‌

- బ‌ల‌హీన‌మైన క‌థ‌
- సెకండాఫ్‌
- విల‌న్‌

లాస్ట్  పంచ్ :  నో ల‌క్...


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS