సందడి సందడిగా ‘మా’ వనభోజనాలు.

మరిన్ని వార్తలు

అందాల హైటెక్ సిటీ నడుమ సుందర నందన వనం. అక్కడ చేరిన వారంతా సినిమా నటులే... వారిలో ఓ పక్క సంతాపం... మరో పక్క సంతోషం... ఓ కంట కన్నీరు, మరో కంట పన్నీరు... వెరసి చక్కటి ఆహ్లాదకర వాతావరణం. ఇదీ ఆదివారం సినీ నటుల వన భోజన కార్యక్రమం. హైటెక్ సిటీలోని ఫీనిక్స్ ఎరీనాలోని టీఎస్ఐఐసి పార్క్ లో ఈ వనభోజనాల కార్యక్రమం సందడి సందడిగా సాగింది. ‘మా’ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి జీవితా రాజశేఖర్, ఉపాధ్యక్షుడు రాజశేఖర్ నేతృత్వంలో విజయవంతంగా ఈ కార్యక్రమం కొనసాగింది.

మా వైస్ ప్రెసిడెంట్లు బెనర్జీ, హేమ, మా ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్ అలీ, తనీష్ జయలక్ష్మి, అనితా చౌదరి, రాజా రవీంద్ర, రవిప్రకాష్ , ఉత్తేజ్,, ఏడిద శ్రీరామ్, సురేష్ కొండేటి, యువహీరో కార్తికేయ, , సీనియర్ నటులు గిరిబాబు, ద‌ర్శ‌కుడు ఎస్వీ కృష్ణారెడ్డి, అచ్చిరెడ్డి, ద‌ర్శ‌కుడు వీర‌భ‌ద్ర చౌద‌రి, ‘మా ’ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు శివాజీరాజా, సంపూర్ణేష్ బాబు, రాశి, డిస్కోశాంతి, శివారెడ్డి, గాయని మంగ్లీ, హీరోయిన్ ముస్కాన్ తదితరులు ఎందరో ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఇంత సందడిలోనూ చోటుచేసుకున్న విషాదానికి కారణం దిశా హత్యాచారం ఘటన. ఆమెపై జరిగిన అత్యాచారం, సజీవ దహనం ఘటన తమ మనసుల్ని కలచివేసిందని అందరూ ఆవేదన వ్యక్తం చేశారు.

అక్కడ ఆమె చిత్రపటాన్ని ఏర్పాటుచేసి ఘనంగా నివాళులర్పించారు. మానవ సమాజంలో ఇలాంటి ఘటనలు జరగడం దురదృష్ణకరమని అన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. ఇలాంటి గుండెకోత ఏ తల్లిదండ్రులకూ రాకూడదని రాజశేఖర్, జీవిత దంపతులు అన్నారు. వినోదాల హరివిల్లు అందరూ నటులే... వారికిది ఆటవిడుపు సమయం. అలాంటప్పుడు ఇక అక్కడ వినోదానికి లోటు ఏముంటుంది.

హీరో రాజశేఖర్ పంచ్ లు, హాస్యనటుడు అలీ మాటవిరుపులు, మిమిక్రీ శివారెడ్డి వినోదపు శైలి, నటుల డ్యాన్సులతో ఆ ప్రాంతమంతా దద్దరిల్లింది. ఫైట్ మాస్టర్ రామలక్ష్మణ్ ల మరో కోణం ఇందులో కనిపించింది. ఎప్పుడూ ఫైట్స్ లో తలమునకలుగా ఉండే రామ్ లక్ష్మణ్ ఈ వేదికపై మాత్రం పాటలకు డ్యాన్స్ చేస్తూ వినోదాన్ని పంచారు. ‘గోకుల కృష్ణా గోపాల కృష్ణా’ అంటూ ఒకప్పటి హీరోయిన్ రాశి తనలోని గాయనీమణిని వెలుగులోకి తెచ్చారు. మరో విశేషం ఏమంటే రాజశేఖర్ తన కూతురు శివాత్మికతో కలిసి ఓ తమిళ పాటను పాడారు. అలనాటి నటుడు శోభన్ బాబు మనముందు లేకపోయినా అచ్చు శోభన్ బాబును తలపించేలా కనిపించే మరో సభ్యుడు ‘వెల్లువచ్చి గోదారమ్మా’ అంటూ పాటకు డ్యాన్స్ చేసి అందరి దృష్టినీ ఆకర్షించారు.

ఫిలిం ఛాంబర్ కార్యదర్శి దామోదర్ ప్రసాద్, డైరెక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎన్. శంకర్ తదితరులు హాజరయ్యారు. నటి హేమ రూ. 25 వేల చెక్కును మా అసోసియేషన్ కు విరాళంగా ఇచ్చారు. ముగ్గురు సభ్యులను దత్తత తీసుకుని వారికి సహాయం చేసేందుకు ఈ మొత్తాన్ని ఇచ్చినట్లు తెలిపారు. ప్రతి ఏటా తను ఈ సహాయం అందజేయదలుచుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి స్పాన్సరర్ గా వ్యవహరించిన వెంకట గోవిందరావు, ను ఈ సందర్భంగా సత్కరించారు. గురురాజ్, సుమన్ బాబులు కూడా ఈ కార్యక్రమానికి స్పాన్సర్స్ గా వ్యవహరించారు. అలాగే అమ్మ ఫౌండేషన్ అశోక్ రెడ్డి పదివేల రూపాయలను 'మా' కు సహాయాన్ని అందించారు శివారెడ్డి, కౌశిక్, శిల్పాచక్రవర్తి, అనితా చౌదరి వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS