యూట్యూబ్ ఛానెల్ ఉంటే చాలు ప్రపంచం మొత్తం మన చేతుల్లో ఉన్నట్లే. యూట్యూబ్‌లో దొరకని ఇన్‌ఫర్మేషన్ లేదు. కనిపించని అసభ్యతా లేదు. చాలా ఈజీ యాక్సిస్ ఇది అన్ని రకాల సాంఘిక, అసాంఘిక కార్యకలాపాలకు కూడా. అయితే ఇలాంటి ఛానెల్స్‌ని సామాజిక బాధ్యతతో నిర్వహిస్తే చాలా ఉపయోగకరంగా ఉంటుంది. కానీ కొన్ని అసాంఘిక శక్తులు ఈ ఛానెల్స్‌ని చెడు వ్యవహారాలకు ఉపయోగిస్తున్నారు. యూ ట్యూబ్ వేదికగా అనేక రకాలుగా అసభ్యకర ప్రచారాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా సెలబ్రిటీస్‌కి సంబంధించిన మార్ఫింగ్స్ వీడియోలు, ఫోటోలు పోస్ట్ చేసి, సంబంధం లేని టాపిక్స్ వాటికి యాడ్ చేసి ప్రచారం చేస్తున్నారు. ఈ కారణంగా సినీ పరిశ్రమలో అలజడి రేగింది. ఈ రకమైన ప్రచారాలు సెలబ్రిటీస్‌ని కుంగదీస్తున్నాయంటూ, మూవీ ఆర్టిస్ట్స్ ఆసోసియేషన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు మురళీ మోహన్ ఈ విషయంపై గట్టిగా స్పందించారు. ముఖ్యంగా హీరో, హీరోయిన్స్‌పై వస్తున్న అసత్య ప్రచారాలను కట్టుదిట్టం చేయాలని నడుం బిగించింది మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్. ఇందుకోసం ప్రత్యేకమైన ఏర్పాట్లను కూడా చేసిందట. ఎన్ని చేసినా పైరసీ భూతాన్ని తరిమికొట్టలేకపోతున్నట్లే, యూ ట్యూబ్ అసభ్యతని కూడా తరిమికొట్టడం సాధ్యం కాని పని. కానీ మా అసోసియేషన్ తరపున మురళీ మోహన్, శివాజీరాజా, రాజేంద్రప్రసాద్ తదితరులు ఈ విషయంపై కొంచెం గట్టిగానే నడుం బిగించారు. వీరి ప్రయత్నాలు ఫలించి, ఎంతో కొంతైనా మార్పు రావాలని ఆశిద్దాం.