ఎన్నో ఏళ్లుగా నలుగుతున్న వ్యవహారం.. `మా భవనం.` మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా)కి సొంత భవనం అంటూ లేదు. ఈ భవన నిర్మాణం గురించి చాలాసార్లు ప్రయత్నించారు. `మా` అధ్యక్షులుగా పోటీలో నిలిచిన వాళ్లంతా `ఈసారి మాకు భవనం వస్తుంది` అని ఢంకా బజాయించి మరీ.. గెలిచినవాళ్లే. కానీ ఒక్కరి వల్ల కూడా అది సాధ్యం కాలేదు. చివరికి `మా` బిల్డింగ్ అనేది పెద్ద కామెడీ అయిపోయింది.
ఈసారి ఎన్నికలలోనూ ప్రధాన ఎజెండా మా బిల్డింగే. `నన్ను అధ్యక్షుడ్ని చేయండి. మాకు సొంత భవనం తీసుకొస్తా` అంటూ వాగ్దానాలు మొదలెట్టారు. ప్రభుత్వం `మా` బిల్డింగ్ కోసం స్థలం కేటాయిస్తే, అందులో విరాళాలు సేకరించి ఓ భవనం నిర్మించాలన్నది ప్లాన్. హైదరాబాద్ లో స్థలాల రేట్లు చాలా దారుణంగా ఉంటాయి. ప్రైమ్ ఏరియాలో `మా` బిల్డింగ్ కట్టాలంటే కనీసం 100 కోట్లకు పైమాటే. మరి.. ప్రభుత్వం అంత విలువైన స్థలం ఇస్తుందా? అనేది పెద్ద అనుమానం. స్థలం దొరికితే.. విరాళాలు సేకరించి, భవనం నిర్మించడం పెద్ద విషయం ఏమీ కాదు. మా భవన నిర్మాణంలో 25 శాతం ఖర్చు మేం భరిస్తాం అంటూ మంచు ఫ్యామిలీ మాటిచ్చింది. మిగిలిన 75 శాతం చకచక రాబట్టొచ్చు. ఇంతా చేస్తే.. మా భవనానికి ఎవరి పేరు పెడతారు? అనే అనుమానాలు మరోటి. ఈ భవనానికి చిరంజీవి పేరు పెట్టాలని కొందరు, కాదు.. ఎన్టీఆర్ పేరు పెట్టాలని ఇంకొందరు.. ఇలా మాలో అప్పుడే పేరు కోసం కొట్లాట మొదలైపోయింది. అందుకే ఎవరికి వారు.. ఈ భవన నిర్మాణాన్ని బూచిగా చూసి భయపడిపోతున్నారు. ప్రభుత్వం స్థలం ఇచ్చేదీ లేదు, అందులో భవనం కట్టేదీ లేదు అంటూ `మా` సభ్యులే లోపాయికారిగా చెప్పుకోవడం కొసమెరుపు.