`మా` ఎన్నికలు ఎప్పుడూ లేనంత ఉత్కంఠతని రేపుతున్నాయి. ప్రెస్ మీట్లూ, పరస్పర ఆరోపణలతో ఎన్నికల పర్వం మొదలైంది. మా ఎన్నికలు ఎప్పుడు జరిగినా... హోరా హోరీ తప్పదన్న విషయం అర్థమవుతూనే ఉంది. అయితే ఈసారి మా అధ్యక్షుడ్ని ఏకగ్రీవంగా ఎంచుకోవాలన్న ప్రయత్నాలూ ఓ వైపు సాగుతున్నాయి. సినీ పెద్దలంతా కలిసి.. ఒకరిని ఏకగ్రీవంగా ఎంపిక చేస్తే.. నాకు ఇష్టమే అని విష్ణు ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రధాన పోటీ దారుడైన ప్రకాష్ రాజ్ దీ అదే మాట. అదే జరిగిన పక్షంలో.. ఈసారి మా అధ్యక్షుడెవరన్న ఆసక్తి నెలకొంది. ఆ ఛాన్స్ ఈసారి మహిళకే దక్కుతుందని `మా`లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
`మా` చరిత్రలో ఇప్పటి వరకూ ఓ మహిళని అధ్యక్ష పీఠంలో కూర్చోబెట్టలేదు. కానీ ఈసారి మాత్రం ఆ ఛాన్స్ ఉందని పిస్తోంది. జీవిత, జయసుధలలో ఒకరిని మా అధ్యక్షురాలిగా నియమించే అవకాశం ఉందని సమాచారం. `మా` విషయంలో జీవిత, జయసుధలకు మంచి పట్టు ఉంది. మా రాజకీయాలు వాళ్లకు బాగా తెలుసు. పైగా ఈసారి బరిలో జీవిత కూడా ఉన్నారు. కాబట్టి.. వీళ్లలో ఒకరికి మా పీఠం దక్కే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. మరి.. చివరి క్షణాల్లో పోటీ ఉంటే తప్ప - వీళ్లలో ఒకరు అధ్యక్ష పీఠంలో కూర్చోవడం ఖాయం.