ప్రకాష్ రాజ్ ప్రెస్ మీట్లో.... బోరుమని కన్నీరు పెట్టుకున్న నటుడు బెనర్జీ. నిజానికి బెనర్జీని ఎప్పుడూ అలా చూసింది లేదు. `మోహన్ బాబు గారు నన్ను దుర్భాషలాడారు. మూడ్రోజుల నుంచీ అదే షాక్ లో ఉన్నా. తేరుకోలేకపోతున్నా` అంటూ తన బాధని వెళ్లగక్కారాయన. తండ్రి లాంటి పెద్దాయన అలాంటి మాటలు అనేసరికి తట్టుకోలేకపోయానని, ఆయన కొట్టడానికి వచ్చారని, చేయి చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు బెనర్జీ. నిజంగానే మోహన్ బాబు - బెనర్జీ మధ్య అంత గొడవ ఏం జరిగింది? ఎందుకు జరిగింది? అనే ఆరాలు మొదలయ్యాయిప్పుడు. దీనిపై బెనర్జీ కూడా వివరంగానే క్లారిటీ ఇచ్చారు.
ఆదివారం పోలింగ్ రోజున... 'మా' సభ్యుడొకరిపై నరేష్ చేయి చేసుకున్నారని, ఆ సభ్యుడు ప్రకాష్ రాజ్ ప్యానల్ కి చెందిన వాడని, ఈ విషయం గ్రహించి.... ప్రకాష్ రాజ్‌ప్యానల్ తరపున పోటీ చేస్తున్న తనీష్ అడ్డుకున్నాడని, దాంతో తనీష్ కీ నరేష్ కీ మధ్య కాస్త వాగ్వివాదం జరిగిందని, అంతలో మోహన్ బాబు కలగజేసుకుని తనీష్ ని దుర్భాషలాడారని బెనర్జీ చెబుతున్నారు. తనీష్ తరపున మాట్లాడ్డానికి వచ్చిన బెనర్జీని సైతం మోహన్ బాబు తిట్టార్ట. చేయి చేసుకున్నార్ట. దాంతో.. బెనర్జీ షాకయ్యారు. ''మోహన్ బాబు గారంటే నాకు చాలా ఇష్టం.
అన్నయ్యా అని పిలుస్తాను. ఆయన కుటుంబ సభ్యులు కూడా నాకు తెలుసు. విష్ణు, మనోజ్‌లను ఎత్తుకుని పెంచాను. అప్పటి నుంచీ ఆ కుటుంబంతో అనుబంధం ఉంది. చనువుకొద్దీ నన్ను ఆయన అప్పుడప్పుడూ తిడుతుంటారు. నాలుగ్గోడల మధ్య నన్ను ఏమన్నా ఫీల్ అయ్యేవాడిని కాదు.కానీ వందల మంది సమక్షంలో నన్ను తిట్టారు. 'అంకుల్ ఏమీ అనుకోవద్దు. నాన్న గురించి మీకు తెలిసిందే కదా' అని విష్ణు నన్ను సముదాయించాడు.కానీ మోహన్ బాబు గారు అన్న మాటల్ని తట్టుకోలేకపోయాను. మూడ్రోజుల నుంచీ.. గుండెల్లో అదే బాధ'' అంటూ కన్నీరుమున్నీరయ్యారు బెనర్జీ.