నటీనటులు : సిద్ధు జోన్నలగడ్డ, సీరత్ కపూర్, తనీకెల్లా భరణి తదితరులు
దర్శకత్వం : ఆదిత్య మండల
నిర్మాతలు : సంజయ్ రెడ్డి – అనిల్ పల్లాల- జి. సునీత- కీర్తి చిలుకూరి.
సంగీతం : శ్రీచరణ్ పాకాల
సినిమాటోగ్రఫర్ : సాయి ప్రకాష్
ఎడిటర్: వంశీ అట్లూరి, సిద్ధు జోన్నలగడ్డ
రేటింగ్: 2/5
ప్రేమకథకి లాజిక్ అవసరం లేదు. అందులో ఓ మ్యాజిక్ జరిగితే చాలు. ప్రేమ కథల్లో కొత్తదనం ఏం అవసరం ఉండదు. ఆ ప్రేమని కాస్తైనా కొత్తగా చూపిస్తే చాలు. ప్రేమకథల్లో స్టార్లు అవసరం లేదు. ఆ పాత్రల్ని ప్రేమించేలా చూపిస్తే చాలు. ఇన్ని సౌలభ్యాలున్నాయి కాబట్టే.. ప్రేమకథలు కుప్పలు తెప్పలుగా వస్తూనే ఉంటాయి. `మా ఇంత గాథ వినుమా` కూడా ఓ లవ్ స్టోరీనే. ఇందులో దర్శకుడు ఎంచుకున్న కొత్త పాయింట్ `వైరల్ వీడియో`. ఓ వైరల్ వీడియో వల్ల ఓ ప్రేమ జంట ఎలా విడిపోయింది.. మళ్లీ మరో వీడియోతో వీళ్లు ఎలా కలుసుకున్నారు? అన్నదానికి సమాధానమే.. `మా వింత గాథ వినుమా`.
* కథ
సిద్దు (సిద్దూ జొన్నలగడ్డ) ఇంజనీరింగ్ విద్యార్థి. ఓ కాలేజీ హాస్టల్ ముందు గొడవ చేస్తూ అరెస్ట్ అవుతాడు. ఎస్సై (తనికెళ్ల భరణి)కి తన ప్రేమకథ చెప్పుకుంటూ వస్తాడు. వినీత (సీరత్ కపూర్)ని ప్రేమిస్తాడు సిద్దూ. ఆమె కూడా సిద్దూని ఇష్టపడుతుంది. వినీతకు తన అన్నయ్య కార్తీక్ (కమల్ కామరాజు) అంటే చాలా ఇష్టం. కార్తీక్‌కి పెళ్లి కుదురుతుంది. ప్రీ వెడ్డింగ్ ఫొటో సెషన్ కోసం... వీళ్లంతా కలిసి గోవా వెళ్తారు. అక్కడ జరిగిన చిన్న పొరపాటు వల్ల ఓ వీడియో బయటకు వస్తుంది. ఆ వీడియో వల్ల... అటు కార్తీక్ పెళ్లి ఆగిపోతుంది. ఇటు.. సిద్దు - వినీతలు బ్రేకప్‌చెప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇంతకీ ఆ వీడియోలో ఏముంది? దాని వల్ల ఎదుర్కొన్న పరిణామాలేంటి? అన్నదే మిగిలిన కథ.
* విశ్లేషణ
ఓ వీడియోని వైరల్ చేయడం వల్ల... ఎవరికీ ఏం నష్టం ఉండదు. దాని గురించి జనం కొన్ని రోజులు మాట్లాడుకుంటారు. తరవాత మరో వీడియో వస్తుంది. అందులో పడిపోతారు. కానీ.. మధ్యలో నలిగిపోయేది ఆ వీడియోలో ఉన్న మనుషులూ, ఆ కుటుంబాలే. అదెలా అన్న పాయింట్ తో సాగిన కథ. నిజానికి.. ఇప్పుడు కావల్సిన పాయింట్ ఇది. చెప్పాల్సిన అవసరం ఉన్న కథ ఇది. కాకపోతే.. దర్శకుడు అసలు పాయింట్ పక్కన పెట్టి, కొసరు విషయాలపై దృష్టి పెట్టాడు. దాంతో అనుకున్న ఆశయం పక్క దారి పట్టింది.
కాలేజీ నేపథ్యంలో సన్నివేశాలతో కథ మొదలవుతుంది. ఆయా సన్నివేశాలు బాగా స్లోగా ఉండడంతో కథలోకి వెళ్లడానికి చాలా సమయం పడుతుంది. విశ్రాంతికి ముందు... వైరల్ వీడియో హంగామా మొదలవుతుంది. ఈలోగా హీరో, హీరోయిన్లు చూసుకోవడాలూ, మాట్లాడుకోవడాలూ, వాళ్ల మధ్య గొడవ.. అది తొలగిపోయి.. ప్రేమ మొదలవ్వడం ఇలా సాగుతుంది కథ. ఈ కథని.. ఫ్లాష్ బ్యాక్ నేరేషన్‌లో చెప్పుకుంటూ పోవడం వల్ల, కాస్త కొత్తగా అనిపించింనా, అది కూడా పాత ఫార్మెటే అన్నది గుర్తు పెట్టుకోవాల్సిన విషయం.
`పోలీస్ స్టేషన్లో మాకు పెద్దగా పనులుండవు. చాయ్ తాగి, నాలుగు కబుర్లు చెప్పి, సాయింత్రానికి వెళ్లిపోవడమే` అంటాడు తనికెళ్లభరణి. నిజంగా పోలీస్‌స్టేషన్లు, పోలీసులూ అలా ఉన్నారా? ఈవ్ టీజింగ్ కేసులో పట్టుకున్న ఓ కుర్రాడ్ని పట్టుకుని, `నీ కథ చెప్పు వింటా.` అనడం.. ఆ కథ వినడానికి పరితపించిపోవడం మరీ సిల్లీగా అనిపిస్తుంది. ప్రతీ నిర్ణయమూ ఆచి తూచి తీసుకునే వినీత.. గోవాలో.. సిద్దూని అప్పటికప్పుడు పెళ్లి చేసుకోవడానికి ఎలా ఒప్పుకుంది? అన్నది లాజిక్ లేని విషయమే. వైరల్ వీడియో వల్ల, చాలా జీవితాలు తారుమారు అయిపోతాయి. వాళ్ల మనసుల్ని మార్చడానికి హీరో ఎన్నో రకాలుగా ప్రయత్నిస్తాడు. అప్పుడు మారని వాళ్లు మరో చిన్న వీడియోకి లొంగిపోవడం చూస్తే... ఆశ్చర్యం కలుగుతుంది.
* నటీనటులు
సిద్దు జొన్నలగడ్డ రొమాంటిక్ కథలక బాగా నప్పుతాడు. మరోసారి అవలీలగాచేసుకుంటూ వెళ్లాడు. తన లుక్స్ బాగున్నాయి. కానీ ఒకొక్క సందర్భంలో ఒక్కో యాసలో మాట్లాడాడు. కంటిన్యుటీ చూసుకోలేదు. అన్నట్టు ఈ సినిమాకి కథ కూడా తానే అందించాడు. సీరత్ కపూర్ ఇంకా నటనలో ఓనమాలు రానట్టేకనిపిస్తోంది. ఒక్కటంటే ఒక్క ఎక్స్‌ప్రెషన్ తోనే సినిమా మొత్తం లాగించేసింది. తనికెళ్లభరణి, జేపీ.. వీళ్లంతా ఓకే.
* సాంకేతిక వర్గం
పాటల్లో ఏదీ గుర్తుండదు. బ్రీత్ లెస్‌సాంగ్ మరీ అర్థం కాకుండా సాగింది. సినిమా నిడివి కూడా గంటా నలభై నిమిషాలు మాత్రమే. ఓటీటీకి ఇవ్వాలని ముందే ఫిక్సయి ఈ సినిమా తీసినట్టున్నారు. తక్కువ లొకేషన్లే కనిపిస్తాయి. దర్శకుడు ఓ మంచి పాయింటే చెప్పాలనుకున్నాడు. కానీ.. దాన్ని సమర్థవంతంగా తెరపై ఆవిష్కరించలేదు.
* ప్లస్ పాయింట్స్
టీనేజ్ కథ
కథలోని పాయింట్
నిడివి
* మైనస్‌పాయింట్స్
గందరగోళం
* ఫైనల్ వర్డిక్ట్: వైరల్.. ఫీవర్!