ఏదో ఒక రకంగా సంచలన వ్యాఖ్యలు చేసి, మీడియాకెక్కితే, ఫ్రీగా పబ్లిసిటీ వస్తుందని భావిస్తున్నారిప్పుడు కొందరు ముద్దుగుమ్మలు. అవకాశాల్లేకపోతే, ఆ అవకాశాలను పొందడానికి ఇదో కొత్త రకం ఫ్యాషన్ అయిపోయింది. మొన్నీ మధ్యనే హాట్ భామ శ్రీరెడ్డి 'కాస్టింగ్ కౌచ్' అంటూ రచ్చకెకి, తెగ హడావిడి చేసింది. ఆ రకంగా కొన్ని రోజులు ఆమె గురించి మాట్లాడుకున్నారంతా. అలాగే ఇప్పుడు మరో బ్యూటీ రచ్చకెక్కినట్లుంది. ఆమె ఇంకెవరో కాదు, మాధవీలత.
'నచ్చావులే' సినిమాతో తెరంగేట్రం చేసిన ఈ ముద్దుగుమ్మ తర్వాత 'స్నేహితుడు' తదితర చిన్నా చితకా సినిమాల్లో నటించింది. అయితే ప్రస్తుతం ఈ భామని ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. దాంతో ఓ పబ్లిసిటీ స్టంట్తో వార్తల్లో నిలిచింది. అదే 'కాస్టింగ్ కౌచ్'. ఈ భామ కూడా కాస్టింగ్ కౌచ్ పైనే చిర్రుబుర్రులాడిందండోయ్. ఈ మధ్య రకుల్ ప్రీత్‌సింగ్ ఓ సందర్భంలో ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్లాంటివేమీ లేవనీ, తనకు అలాంటి అనుభవాలు ఇంతవరకూ ఎదురు కాలేదనీ చెప్పింది. అయితే రకుల్ చెప్పిన మాటలు పచ్చి అబద్ధం అంటూ హాట్ హాట్ వ్యాఖ్యలు చేసింది ముద్దుగుమ్మ మాధవీలత.
అలాగే ఈ భామ ఇంతటితో ఆగలేదండోయ్. కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న 'మహానటి' సినిమాపై కూడా తన అభిప్రాయాన్ని వెల్లడించింది. సావిత్రి అందం, అభినయాన్ని మ్యాచ్ చేయగల హీరోయిన్ టాలీవుడ్లో ఛార్మి మాత్రమే అని ఆమె అభిప్రాయపడింది. అంతేకాదు ప్రస్తుతం సావిత్రి పాత్రలో నటిస్తున్న కీర్తి సురేష్, ఆ పాత్రకు తగదనీ మాధవీలత సంచలన వ్యాఖ్యలు చేసింది.
ఇదంతా చూస్తుంటే, ప్రస్తుతం ఖాళీగా ఉన్న మాధవీలత ఈ రకంగా వార్తల్లో నిలవడం ద్వారా, ఏమైనా చిన్నా చితకా అవకాశాలు దక్కించుకోవాలని చూస్తోంది కాబోలు.