మాధవీలత... ఈ కథానాయిక సినిమాల్లో చేసినప్పటి కంటే, వాటికి దూరమై సోషల్ మీడియాలో చెలరేగుతున్నప్పటి నుంచీ ఎక్కువ ఫేమస్ అయ్యింది. తన ట్వీట్లూ, కామెంట్లూ అప్పుడప్పుడూ వివాదాస్పదమవడం కామన్‌గా మారింది. తాజాగా సెలబ్రెటీల పెళ్లిళ్ల గురించి కొన్ని ఆసక్తికరమైన కామెంట్లు చేసింది మాధవీలత. ''మాస్కులు పెట్టుకుని మరీ పెళ్లిళ్లు చేసుకోవడం ఎందుకు? ఇంకొన్నాళ్లు ఆగలేరా? ఇప్పుడు కాకపోతే.. మరో యేడాది. పిల్ల దొరకదా? పిల్లోడు పారిపోతాడా'' అంటూ సెటైరికల్ కామెంట్లు పెట్టింది. అంతే కాదు.. ''మారిపోయే మనుషులతో బంధాలు పెట్టుకోవడం ఎందుకు? కొన్నాళ్లు ఆగలేని వాళ్లు సంసారాలు చేస్తారా'' అంటూ కాస్త ఘాటైన టచ్ ఇచ్చింది. అంతే కాదు.. తాను మాట్లాడుతోంది సెలబ్రెటీల గురించేనని మరో వ్యాఖ్య జోడించింది.
ఈమధ్యే దిల్ రాజు, నిఖిల్ ల పెళ్లిళ్లు అయ్యాయి. బహుశా.. వాటి గురించే మాధవీలత కామెంట్లు చేసిందేమో. పెళ్లి అనేది వ్యక్తిగతం. ఎప్పుడు, ఎలా చేసుకోవాలన్నది వాళ్ల ఇష్టం. పైగా నిఖిల్, దిల్ రాజుల పెళ్లిళ్లు లాక్ డౌన్ నిబంధనలకు అనుగుణంగా జరిగాయి. వాటిని ఉల్లంఘించారన్న రుజువులేం లేవు. కానీ మాధవీలత మాత్రం సీరియస్‌గా స్పందించింది. తన వ్యాఖ్యలపై నెగిటీవ్ కామెంట్లు కూడా వస్తాయని ముందే గ్రహించిందేమో.. ''ఇది నా ఫేస్ బుక్ .. నా ఇష్టం. నా అభిప్రాయాలను స్వేచ్ఛగా చెప్పే హక్కు నాకుంది'' అంటూ ముక్తాయించింది. తన అభిప్రాయాలను తానెంత స్వేచ్ఛగా చెప్పిందో అలానే ఎవరి జీవితాలకు సంబంధించిన నిర్ణయాలను వాళ్లు అంత స్వేచ్ఛగానూ తీసుకునే హక్కుంది.
మరొకరి స్వేచ్ఛకు భంగం కలగనంత వరకూ.. ఎవరినీ తప్పుపట్టలేం. ఈ విషయాన్ని మాధవీలత కూడా గుర్తిస్తే మంచిది.