వివాదాస్పద నిర్ణయాలు తీసుకునే కోలీవుడ్ నిర్మాత మండలి రీసెంట్ గా రివ్యూవర్స్ కి చెక్ పెట్టేలా, థియేటర్స్ దగ్గర రివ్యూలు చెప్పేవారికి పర్మిషన్ లేకుండా చేసింది. ఫేస్‌బుక్, యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్, ఎక్స్ లాంటి సోషల్ మీడియా వేదికలపై సినిమా రివ్యూలు చెప్పటం, రాయటం పై నిషేధం విధించాలంటూ తమిళ సినీ యాక్టివ్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ హైకోర్టులో పిటిషన్ ఫైల్ చేసింది. తాజాగా ఈ పిటీషన్ పై విచారణ చేపట్టిన మద్రాస్ హైకోర్టు ఈ పిటీషన్ ని కొట్టి వేసింది.
తమిళ సినీ యాక్టివ్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ వేసిన పిటీషన్ లో థియేటర్స్ లో సినిమా రిలీజ్ అయిన మూడు రోజుల తర్వాతే రివ్యూలు ఇవ్వాలని, త్రీ డేస్ లోపు ఎట్టి పరిస్థితుల్లోనూ రివ్యూలు ఇవ్వకూడదని కోర్టును ఆశ్రయించారు. మద్రాస్ హైకోర్టు వీరి పిటీషన్ ని స్వీకరించటానికి కూడా ఇష్టపడలేదు. జస్టిస్ ఎస్.సౌంథర్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ రిట్ పిటిషన్‌ను తిరస్కరించింది.
కోలీవుడ్ ని ఫాలో అవుతూ టాలీవుడ్ లో కూడా ఇలాంటి నిర్ణయం తీసుకుందాం అనుకుంటున్నామని ఒక ఇంటర్వ్యూలో దిల్ రాజు కూడా పేర్కొన్నారు. అయితే ఇప్పుడు టాలీవుడ్ కూడా ఆ ఆలోచన విరమించు కోవచ్చు. తమిళనాడులో సక్సెస్ అయితే తెలుగు రాష్ట్రాల్లో ఇంప్లిమెంట్ చేసేవారు. కానీ తాజాగా మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పుతో రివ్యూవర్స్ కి ఊరట లభించింది. తమిళ ప్రొడ్యూసర్స్ కి షాక్ తగిలింది.