బాలీవుడ్ లో ఘన విజయం సాధించిన చిత్రం అంధాధూన్. దీన్ని తెలుగులో మాస్ట్రో పేరుతో రీమేక్ చేశారు. మేర్లపాక గాంధీ దర్శకుడు. తమన్నా, నభా నటేషా కథానాయికలు. ఈనెల 17న హాట్ స్టార్ లో విడుదల అవుతోంది. ఓటీటీలో ఓ క్రేజీ సినిమా విడుదల కావడం పెద్ద విశేషం ఏమీ కాదు. ఇటీవల సినిమాలు ఎక్కువగా ఓటీటీలోనే విడుదల అవుతున్నాయి. కాకపోతే.. ఓటీటీలో విడుదలైన ఏ సినిమాకీ సరైన స్పందన లేదు. నిశ్శబ్దం, వి, నారప్ప, టక్ జగదీష్ లాంటి సినిమాలు ఓటీటీలోకే వచ్చాయి. విడుదలకు ముందు ఈసినిమాలపై ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఓటీటీలో కాదు.. థియేటర్లలో చూడాల్సిన సినిమా అనుకున్నారు.
తీరా చూస్తే... ఓటీటీలో ఫట్టుమన్నాయి. కనీస వ్యూవర్ షిప్ కూడా ఈసినిమాలకు రాలేదు. కోట్లు పెట్టి కొన్న ఓటీటీ సంస్థలు ఈ సినిమాలతో భారీగా నష్టపోయాయి. ఆయా సినిమాల్లో నటించిన హీరోలకూ.. అవి మైనస్ లుగా మారాయి. సోషల్ మీడియాలో సైతం ఆయా సినిమాల్లో ట్రోల్స్ బాగా నడిచాయి. ఓటీటీలో సినిమా విడుదల అంటే ఫట్టే...అనే సెంటిమెంట్ బలంగా పాతుకుపోయింది. అందుకే చాలామంది సినీ ప్రేమికులు మాస్ట్రోని సైతం లైట్ తీసుకుంటున్నారు. ఇప్పటికే ఈ సినిమాని హిందీలో చూసేశారు. ఆకిక్ తెలుగులో రాదన్నది అందరి ఫీలింగ్. మరి.. ఈ బ్యాడ్ సెంటిమెంట్ ని. మాస్ట్రో ఎలా దాటుకొస్తాడో చూడాలి.