మా తెలుగు సినిమాకి ఏం తక్కువ అని సగటు తెలుగు సినీ ప్రేక్షకుడు కాలరెత్తి, మీసం మెలేసిన సందర్భమది. బాలీవుడ్‌లో అంతకుముందు మన సినిమాల గురించి, మాట్లాడుకున్నా, 'మగధీర' ఇండియన్ సినిమాపై వేసిన 'రాజ' ముద్ర అలాంటిలాంటిది కాదు. ఒకేసారి హిందీలో తెలుగుతో పాటు విడుదల చేయలేదు కానీ, చేసి ఉంటే, ఇప్పుడు 'బాహుబలి'లా అప్పుడే 'మగధీర' బాలీవుడ్ బాక్సాఫీస్ దుమ్ము దులిపేసేది.
హీరోగా చరణ్‌కి ఇది రెండో సినిమా మాత్రమే. మెగాస్టార్ చిరంజీవి తనయుడు తెలుగు సినిమా బాక్సాఫీస్‌పై తనదైన ముద్ర వేస్తాడా లేదా? అన్న అభిమానుల ఉత్కంఠకి, పవర్‌ఫుల్‌గా సమాధానమిచ్చిన సినిమాగా 'మగధీర'ను చెప్పుకోవచ్చు. సినిమాల్లో యుద్ద సన్నివేశాలు కావచ్చు, ఎమోషన్స్ కావచ్చు, హీరో, హీరోయిన్ మధ్య లవ్ ట్రాక్ కావచ్చు, కాజల్ అందం కావచ్చు, చరణ్ డాన్సులు కావచ్చు, విజువల్ అద్భుతాలు కావచ్చు, శ్రీహరి నటన కావచ్చు ఇలా ఒక్కటేమిటి మగధీర గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.
ఇప్పటికీ, మగధీర సినిమా చూస్తే కొత్తగానే అనిపిస్తుంది. అదీ ఆ సినిమా ప్రత్యేకత. 70 కోట్ల పైబడి షేర్ సాధించిన తొలి తెలుగు సినిమాగా అప్పట్లో 'మగధీర' సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. ఇప్పటికీ చరణ్ సినిమాల్లో వసూళ్ల పరంగా 'మగధీర' రెండో ప్లేస్‌లో నిలిచింది. దటీజ్ 'మగధీర'.
ఇది రాజమౌళి అద్భుతం ఇది చరణ్ బాక్సాఫీస్‌పై సంధించిన అసలు సిసలు వసూళ్ల అస్త్రం.