సొంత కథ రాసుకోవడం కంటే, పక్క భాషలో హిట్ అయిన సినిమాని రీమేక్ చేసుకోవడం ఉత్తమమని భావిస్తున్నారు దర్శకులు. అందుకే రీమేకులకు అంత గిరాకీ. అయితే... అందులో హిట్స్ అయిన సినిమాలు చాలా తక్కువ. అయినా రీమేకుల జోరు ఆగడం లేదు. ఆఖరికి పరిస్థితి ఎంత వరకూ వెళ్లిందంటే.. ఫ్లాప్ అయిన సినిమాల్ని వదిలిపెట్టడం లేదు. ఇటీవల విడుదలైన ఓ ఫ్లాప్ సినిమాని తమిళంలో రీమేక్ చేయడానికి రెడీ అయిపోయారు ఓ నిర్మాత.
వివరాల్లోకి వెళ్తే.. సందీప్ కిషన్ నిర్మాతగా రూపొందిన చిత్రం `వివాహ భోజనంబు`. సత్య కథానాయకుడిగా నటించాడు. లాక్ డౌన్ నేపథ్యంలో సాగే కథ ఇది. డైరెక్ట్ ఓటీటీ (సోనీ లైవ్) ద్వారా ఈ చిత్రాన్ని విడుదల చేశారు. అయితే.... ఓటీటీలోనూ ఈ సినిమాని ఎవరూ పట్టించుకోలేదు. చూసినవాళ్లంతా పెదవి విరిచేశారు. ఓరకంగా ఇది డిజాస్టర్ సినిమా. అయినా సరే, దీన్ని తమిళంలో రీమేక్ చేయడానికి రెడీ అయిపోయారు. కథ నచ్చిందో, లేదంటే ఏకంగా సినిమానే నచ్చిందో తెలీదు గానీ, మంచి రేటుకి ఈ సినిమా రైట్స్ కొనేసుకున్నారు. ఓటీటీ ద్వారా సందీప్ కి మంచి మొత్తమే వచ్చింది. ఇప్పుడు రైట్స్ రూపంలోనూ గిట్టుబాటు అయ్యింది. మొత్తానికి వివాహ భోజనంబు ఫ్లాప్ అయినా - సందీప్ మాత్రం లాభాల్లో తేలిపోయాడు. అంతకంటే కావల్సిందేముంది?