ఈ మధ్యకాలంలో 50 రోజులు ఓ సినిమా ఆడింది అంటే ఒకింత ఆశ్చర్యకరమైన విషయంగానే భావించాలి. 'రంగస్థలం' సినిమాతో టాలీవుడ్‌లో ఆ ఈక్వేషన్స్ మళ్లీ మొదలయ్యాయి.
జెన్యూన్‌గా 50 రోజులు ఆడిన సినిమాగా 'రంగస్థలం' సినిమాని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత ఆ ప్లేస్‌ని ఆక్యుపై చేసింది 'మహానటి' సినిమానే. కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని యంగ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కించారు. అశ్వనీదత్ కుమార్తైలు ప్రియాంకా దత్, స్వప్న దత్‌లు నిర్మించారు.
అలనాటి మేటి నటి సావిత్రి జీవితాధారంగా తెరకెక్కిన ఈ చిత్రంలో ఎంతో మంది ప్రముఖ నటీనటులు, యంగ్ స్టర్స్ కీలక పాత్రల్లో కనిపించి మెప్పించారు. సినిమాని తెరకెక్కించేటప్పుడు చిత్ర యూనిట్ పడిన టెన్షన్ అంతా విడుదలయ్యాక, వచ్చిన ప్రశంసల వర్షంతో తీరిపోయింది. ప్రముఖుల జీవిత చరిత్రలను తెరకెక్కించడమంటే అంత ఆషామాషీ కాదు. అలాంటిది ఇంత చాకచక్యంగా కష్టపడి తెరకెక్కించినందుకు వారి కష్టానికి తగిన ప్రతిఫలం దక్కింది.
తెలుగు రాష్ట్రాల్లోనే కాక, ఓవర్సీస్‌లో కూడా 'మహానటి'కి అరుదైన గౌరవం దక్కింది. బాక్సాఫీస్ వద్ద కాసుల పంట కూడా పండింది. సక్సెస్‌ఫుల్‌గా 50 రోజులు పూర్తి చేసుకుంది. 'మహానటి'ని ఇంతగా విజయవంతం చేసిన ప్రేక్షక దేవుళ్లకు మనసారా కృతజ్ఞతలు తెలియజేసింది 'మహానటి' అండ్ టీమ్.