టాలీవుడ్‌లో ఓ స్టార్ హీరో సినిమా విడుదలై చాలా రోజులైంది. భారీ వసూళ్ల గురించీ, రికార్డుల గురించీ ఈమధ్య అస్సలు మాట్లాడుకోలేదు. పైగా మహేష్ బాబు 25వ సినిమా. అందుకే `మహర్షి` ముందు నుంచీ టాక్ ఆఫ్ ది టౌన్‌గానే నిలిస్తూ వచ్చింది. ఈ స్క్రిప్టు కోసం దర్శకుడు వంశీ పైడిపల్లి రెండేళ్లు కష్టపడ్డాడు. ముగ్గురు అగ్ర నిర్మాతలు కలిసి దాదాపు 150 కోట్లతో ఈసినిమా తెరకెక్కించారు. దానికి తగ్గట్టుగానే బిజినెస్ జరిగింది. థియేటరికల్ రైట్స్ దాదాపుగా వంద కోట్లకు అమ్ముడయ్యాయి. భారీ అంచనాల మధ్య విడుదలై.. ఓపెనింగ్స్ అదరగొట్టిన `మహర్షి` ఈ వారం టాక్ ఆఫ్ ది టౌన్.
గురువారం విడుదలైన ఈ మహర్షికి అనూహ్యంగా డివైడ్ టాక్ వచ్చింది. కథలో కొత్తదనం లేదని, సినిమా మరీ లెంగ్తీగా సాగిందని చెప్పుకున్నారు. అయితే.. ఇన్ని నెగిటీవ్ టాక్‌ల మధ్య తొలిరోజు పాతిక కోట్లకు పైగానే సాధించి ప్రభంజనం సృష్టించింది. రెండో రోజూ వసూళ్ల హవా తగ్గలేదు. దాదాపు 7 కోట్ల వరకూ తెచ్చుకుంది. తొలిరోజు వసూళ్లలో చాలా చోట్ల నాన్ బాహుబలి రికార్డుల్ని తన పేరిట వేసుకుంది. రంగస్థలం వసూళ్లని దాటుకుంటూ వెళ్లగలిగింది. శని, ఆదివారాలూ నిలకడైన వసూళ్లు అందే అవకాశాలున్నాయని ట్రేడ్ వర్గాలు లెక్కగడుతున్నాయి.
మహర్షికి ప్రముఖుల ప్రశంసలు దక్కడం విశేషం. ఈ సినిమా చూసిన వెంటనే చిరంజీవి చిత్రబృందానికి ఫోన్ చేసి మెచ్చుకున్నారు. మహేష్ కూడా ఈ సినిమా ఫలితంపై చాలా సంతృప్తిగా ఉన్నాడు. తన 25వ సినిమాని ఓ మైలు రాయిగా మలిచిన చిత్రబృందానికి కృతజ్ఞతలు తెలిపాడు. ఈ సినిమాని బాలీవుడ్‌లో రీమేక్ చేసే అవకాశాలున్నాయని అప్పుడే వార్తలు కూడా వచ్చేస్తున్నాయి. దానికి తోడు ఈ కథ ఆలోచన శ్రీవాస్ అనే మరో దర్శకుడిదని, దిల్‌రాజుకి శ్రీవాస్ గతంలో ఓ కథ చెప్పారని, ఆ కథకూ మహర్షికీ దగ్గర పోలికలు ఉన్నాయని, ఇప్పుడు ఈ విషయాన్ని దిల్‌రాజు గప్‌చుప్ గా సెటిల్ చేసుకునే పనిలో ఉన్నారని గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి.