కరోనా కాలం కదా? బడ్జెట్లని అదుపు చేసుకుంటే గానీ, సినిమా నిర్మాణం శ్రేయస్కరం కాని పరిస్థితి. 50 సీట్లతో సినిమాహాళ్లు నడుపుకోండి అని ప్రభుత్వాలు చెప్పేశాయి. ఇదెప్పుడు మొదలవుతుందో, ఈ నిబంధన ఎంత కాలం ఉంటుందో తెలీదు. అందుకే.. ముందే బడ్జెట్లు తగ్గించుకుంటే తప్ప, సినిమాలు సాగవు. కొంతమంది నిర్మాతలు ముందే మేల్కొంటున్నారు. `మహా సముద్రం` సినిమాకి సంబంధించి బడ్జెట్ కోత మొదలైనట్టే. ఈ సినిమాలో కథానాయికగా అతిథిరావు హైదరీని ఎంచుకున్నారు. నిజానికి... సమంత నుంచి సాయి పల్లవి వరకూ స్టార్ హీరోయిన్లందరినీ ఈ సినిమా కోసం పరిశీలించారు. ఎందుకంటే `మహా` అనే అమ్మాయి చుట్టూ తిరిగే కథ ఇది.
కథానాయిక పాత్రకు చాలా ప్రాధాన్యం ఉంది. అందుకే ఓ స్టార్ హీరోయిన్ ని ఈ సినిమా కోసం ఎంచుకోవాలనుకున్నారు. కానీ.. ఇప్పుడు అతిథిరావుతో సరిపెట్టుకున్నారు. సమంత, కీర్తి, సాయి పల్లవిలతో పోలిస్తే.. అతిథిరావు పారితోషికం చాలా చాలా తక్కువ. అతిథిని ఎంచుకోవడానికి ప్రధాన కారణం.. బడ్జెట్ కోతే అని తెలుస్తోంది. ఏకే ఎంటర్టైన్‌మెంట్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. అజయ్ భూపతి దర్శకత్వం వహిస్తున్నాడు. సిద్దార్థ్ ఓ కీలక పాత్రలో కనిపించనున్నాడు. 2021లో ఈ సినిమా పట్టాలెక్కుతుంది. కథానాయిక ఎంపికలోనే కాదు, మేకింగ్ లోనూ ఖర్చులు అదుపులో ఉంచుకోవాలని దర్శక నిర్మాతలు భావిస్తున్నారు.