సినిమా ఇండ్రస్ట్రీ అంతా స్టార్ హీరోలు, స్టార్ డైరెక్టర్ల చుట్టూనే తిరుగుతుందనుకుంటారంతా. నిజానికి వాళ్ల నుంచి సంవత్సరానికి వచ్చే సినిమాలు పదో పదిహేనో ఉంటాయి. మిగిలిన సినిమాలన్నీ చిన్న, మీడియం బడ్జెట్ సినిమాలే. పెద్ద హీరోలెంత ముఖ్యమో.. యువ హీరోలూ అంతే అవసరం. నిజానికి వాళ్ల వల్లే చిత్రసీమ నడుస్తోంది. ఓ స్టార్ హీరో ఏడాదికి ఒక్క సినిమానే చేయగలడు. అదే ఓ యువ హీరో.. నాలుగైదు సినిమాల్ని అలవోకగా పూర్తి చేసేయగలడు. నాని, శర్వానంద్ లాంటి వాళ్లు సైతం ఇప్పుడు ఆచి తూచి అడుగులేస్తున్నారు.
ఈ దశలో.. చేతినిండా అవకాశాలతో, వచ్చే మూడేళ్ల కాల్షీట్లనీ ఖరారు చేసుకున్న హీరో.. నాగశౌర్య. ఛలో, అశ్వద్ధామ చిత్రాలతో మంచి ఫామ్ లో ఉన్నాడు నాగశౌర్య. తన చేతిలో ఇప్పుడు అరడజను సినిమాలున్నాయి. మరో నాలుగు పైప్ లైన్ లో ఉన్నాయి. నాగ శౌర్య దొరకాలంటే... మరో మూడేళ్లు ఆగాల్సిందే అన్నది టాలీవుడ్ నిర్మాతల టాక్. నాగశౌర్యకి మినిమం మార్కెట్ ఉంది. శాటిలైట్ పరంగానూ తన సినిమాలకు మంచి రేట్లు వస్తున్నాయి.
నాని, విజయ్ దేవరకొండ లాంటి హీరోలు భారీ పారితోషికాలతో నిర్మాతల్ని భయపెట్టేస్తున్న వేళ... నాగశౌర్య అందరికీ అందుబాటులో ఉంటున్నాడు. పైగా చేతిలో.. ఐరా సంస్థ ఉంది. అందుకే.. నాగశౌర్య ముందు నిర్మాతలు క్యూలు కడుతున్నారు. మిగిలిన హీరోలూ నాగశౌర్యలా నిర్మాతల గురించి ఆలోచిస్తే, వాళ్లకు అందుబాటులో ఉంటే.. కచ్చితంగా చిత్రసీమ మరింతగా కళకళలాడుతుంది.