టాలీవుడ్లో ఇప్పుడు సరికొత్త సంప్రదాయం కనిపిస్తోంది. హీరోలంతా ఒకే వేదికపై కలసి సందడి చేస్తున్నారు. ఒకరి ఆడియో ఫంక్షన్‌కి మరొకరు వెళ్లి.. మనస్ఫూర్తిగా అభినందించి వస్తున్నారు. కలసి పార్టీలు చేసుకుంటున్నారు. భరత్ అనే నేను ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కి ఎన్టీఆర్ వెళ్లడం ఆసక్తిని కలిగించింది. ఆ వెంటనే చరణ్, మహేష్, ఎన్టీఆర్‌లు కలసి పార్టీ చేసుకున్న ఫొటో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది.
భరత్ విజయం సాధించిన తరవాత మళ్లీ ఈ ముగ్గురు స్నేహితులూ కలుసుకున్నారు. ఈ మైత్రికి కారణమేంటి? అని మహేష్‌ని అడిగితే చాలా ఆసక్తికరమైన విషయాలు చెప్పుకొచ్చాడు. చరణ్‌తో చాలా క్లోజ్‌గా ఉంటానని, ఎన్టీఆర్‌ని తరచూ కలుస్తుంటానని మహేష్ చెప్పాడు. పెద్ద హీరోలు సఖ్యతగా ఉంటే, ఫ్యాన్స్ మధ్య గొడవలు రావని, ప్రతి పెద్ద సినిమా విజయవంతం అవుతుందని, అలా వరుసగా హిట్లు పడడం... టాలీవుడ్ కి మంచిదని చెప్పుకొచ్చాడు మహేష్.
హీరోల అభిమానుల మధ్య గొడవలు కూడా త్వరలో తగ్గిపోతాయని ఆశాభావం వ్యక్తం చేశాడు. హీరోలాంతా ఇలా చెట్టాపట్టాలేసుకుని తిరిగేస్తుంటే.. అభిమానులు మాత్రం ఎందుకు కొట్టుకుంటారు? వాళ్లూ ఒక్కటైపోతారు. మహేష్ ఆలోచన కూడా అదే.