మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ మహేష్‌బాబు కలిసి ఒకే ఫ్రేమ్‌లో కనిపిస్తే ఎలా ఉంటుంది.? ఆ పిక్చర్ చూడ్డానికి రెండు కళ్లూ చాలవన్నట్లుంటుంది కదా. ఆ అద్భుతం జరిగింది. కానీ సినిమా కోసం కాదు. 'సినీ మహోత్సవం' కోసం. తాజాగా జరిగిన సినీ మహోత్సవం వేడుకలో సీనియర్లు, జూనియర్లు అనే తేడా లేకుండా, సినీ ప్రముఖులంతా హాజరయ్యారు. జయసుధ, జయప్రద వంటి అలనాటి తారామణులు, కృష్ణ, కృష్ణంరాజు తదితర సీనియర్ హీరోలు, ప్రముఖ దర్శక, నిర్మాత సుబ్బిరామిరెడ్డి తదితర సినీ ప్రముఖులతో సినీ మహోత్సవం సందడిగా సాగింది.
ఈ ఈవెంట్‌లో మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ మహేష్‌బాబు జోడీ సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్‌గా నిలిచింది. ఇద్దరూ పక్క పక్కన కూర్చొని కాసేపు కులాసాగా కబుర్లు చెప్పుకున్నారు. వారిద్దరినీ అలా చూసిన అభిమానులకు కడుపు నిండిపోయినట్లయ్యింది. హీరోల మధ్య ఎలాంటి పొరపొచ్చాలు ఉండవన్న విషయాన్ని వీరి ఆత్మీయ కలయిక మరోసారి ప్రూవ్ చేసింది. మహేష్ నటిస్తున్న 'సరిలేరు నీకెవ్వరు' సినిమా విశేషాల్ని అడిగి తెలుసుకున్నారు చిరంజీవి. 'సైరా'కి ఆల్ ది బెస్ట్ చెప్పాడు మహేష్‌బాబు.
చిరంజీవితో కలిసి జయసుధ, జయప్రద తదితర అలనాటి ముద్దుగుమ్మలు హుషారుగా ఫోటోలకు పోజులిచ్చారు. కమెడియన్ ప్రియదర్శి తదితర జూనియర్ నటులు కూడా ఈ సినీ మహోత్సవంలో పాల్గొన్నారు. చిరంజీవితో కలిసి సంతోషంగా సెల్ఫీలు దిగారు. త్వరలో చిరంజీవి నటించిన 'సైరా నరసింహారెడ్డి' చిత్రం విడుదలకు సిద్ధంగా ఉండడంతో, అందరూ మెగాస్టార్‌కి ఆల్ ది బెస్ట్ చెప్పారు.