బాహుబలి తరవాత ప్రభాస్ దేశంలో ఎంత పెద్ద దర్శకుడితోనైనా సినిమా చేయగలడు. కానీ.. అనుభవం కంటే ప్రతిభే ముఖ్యమని నమ్మి సుజిత్ చేతిలో సాహో పెట్టాడు. అయితే ఆ సినిమా అభిమానుల అంచనాల్ని అందుకోలేకపోయింది. వసూళ్లు బాగున్నా - ఎక్కడో ఏదో లోటు. ఈ సినిమా చేసి ప్రభాస్ తప్పు చేశాడని డైహార్డ్ ఫ్యాన్స్ సైతం నొసలు చిట్లించిన పరిస్థితి. ఇలాంటి తరుణంలోనూ సుజిత్‌కి అండగా నిలిచాడు ప్రభాస్. సినిమా విడుదలైన రోజే.. సుజిత్‌కు ప్రభాస్ నుంచి ఫోన్ వచ్చిందని `రిజల్ట్ ఎలా ఉన్నా కంగారు పడొద్దు..` అని భరోసా ఇచ్చాడని తెలుస్తోంది.
తరచూ ప్రభాస్, సుజిత్ ఫోన్లో టచ్‌లోనే ఉన్నారని, సుజిత్ మరీ డీలా పడిపోకుండా ప్రభాస్ అభయ హస్తం అందించాడని సమాచారం. `మనం మళ్లీ సినిమా చేద్దాం` అని సుజిత్‌కి ప్రభాస్ మరో ఆఫర్ ఇచ్చాడని కూడా సన్నిహితులు చెబుతున్నారు. ఈమధ్య సుజిత్ మీడియా ముందుకొచ్చాడు. ప్రింట్ మీడియాతో మాట్లాడాడు. ఈ సందర్భంగా ప్రభాస్ తో మరో సినిమా తొందర్లోనే చేస్తానని ధీమాగా చెబుతున్నాడు. ఆ ధీమాకు కారణం ప్రబాస్ మాట ఇవ్వడమే. అయితే... ఈసారి పక్కా మాస్ కమర్షియల్ సినిమా చేస్తాడట సుజిత్. అలాంటి కథ కూడా సిద్ధంగా ఉందని తెలుస్తోంది. సో.. సుజిత్ కెరీర్‌కి వచ్చిన ఢోకా ఏమీ లేనట్టే.