ఈతరం స్టార్లకు వెండి తెర - బుల్లి తెరంటూ బేధం లేదు. ఎక్కడైనా సరే, తమ మార్క్ చూపిస్తున్నారు. ఎన్టీఆర్ నే చూడండి. బిగ్ బాస్ హోస్ట్ గా అదరగొట్టాడు. ఇప్పుడ `ఎవరు మీలో కోటీశ్వరులు` అంటూ మళ్లీ టీవీల్లో సందడి చేయడం మొదలెట్టాడు. జెమినీలో ప్రసారం అవుతున్న కార్యక్రమం ఇది. ఎన్టీఆర్ హోస్ట్ కావడంతో అందరి దృష్టీ దీనిపై పడింది. రామ్ చరణ్ తో ఎపిసోడ్ చేసి, మంచి రేటింగులే సంపాదించుకున్నారు. అయితే క్రమంగా.. ఈ షోకి రేటింగులు పడిపోయాయి. బిగ్ బాస్ ఎఫెక్ట్, ఆమధ్య ఐపీఎల్ ఎఫెక్ట్ ఈ షోపై గట్టిగా పడ్డాయి. పైగా.. చరణ్, సమంత తప్ప పెద్దగా సెలబ్రెటీలూ రాలేదు. దాంతో... షో కళ తప్పినట్టైంది.
దాంతో ఎన్టీఆర్ కాస్త గుర్రుగా ఉన్నాడని తెలుస్తోంది. ఈ షోకి సరైన రీతిలో ప్రచారం చేయలేదని ఎన్టీఆర్ భావిస్తున్నాడట. అందుకే రేటింగులు లేవన్నది తన ఫీలింగ్. నిజానికి ఎగ్రిమెంట్ చాలా రోజులే ఉన్నా, ముందుగానే ఈ షో పూర్తి చేసి, బయటకు వచ్చేశాడట. ఇక మీదట.. ఈ షో ఎన్టీఆర్ చేయడని, టీవీ హోస్ట్ గా తాను ఇక మీదట కనిపించే అవకాశం లేదన్నది ఇన్ సైడ్ వర్గాల టాక్. మహేష్ బాబుతో తారక్ ఓ ఎపిసోడ్ చేశాడు. అది దీపావళికి ప్రసారమయ్యే అవకాశం ఉంది. ఆ ఎపిసోడ్ కి రేటింగ్స్ పీక్స్ లో ఉండే ఛాన్సుంది. దాంతోనైనా ఎన్టీఆర్ అసహనం కాస్త తగ్గుతుందేమో చూడాలి.