ఈ సంక్రాంతికి `సరిలేరు నీకెవ్వరు` అంటూ సందడి చేశాడు సూపర్ స్టార్ మహేష్ బాబు. సంక్రాంతికి ప్రేక్షకులు ఎలాంటి సినిమాని కోరుకుంటారో, అలాంటి వినోదాన్ని అందించాడు అనిల్ రావిపూడి. ఈసినిమాతో.. టాప్ డైరెక్టర్ల జాబితాలో చేరిపోయాడు అనిల్. తన పనితీరు కి మెచ్చి... అనిల్ కి మరో ఛాన్స్ ఇచ్చాడు మహేష్. `మంచి కథ రెడీ చేయ్.. వెంటనే మనం సినిమా చేద్దాం` అని మాటిచ్చాడు. దాంతో అనిల్ రావిపూడికి మరో సూపర్ ఛాన్స్ దక్కినట్టైంది.
ఎఫ్ 3లో మూడో హీరోగా మహేష్ ఎంట్రీ ఇస్తాడని ప్రచారం జరిగింది. ఈ విషయమై అనిల్ రావిపూడి కూడా మహేష్ ని సంప్రదించాడని సమాచారం. కానీ... ఇద్దరు హీరోలతో స్క్రీన్ పంచుకోవడానికి ససేమీరా అన్నాడని టాక్. దాంతో.. ఆ ప్రతిపాదన పక్కన పెట్టేశారు. ఇప్పుడు మహేష్ తో చేయాల్సిన సినిమా కూడా పక్కకు వెళ్లిపోయిందని తెలుస్తోంది. మహేష్ - అనిల్ రావిపూడి కాంబోలో సినిమా పట్టాలెక్కడం ఇప్పట్లో అసాధ్యమని, మళ్లీ వీరిద్దరూ జట్టు కట్టడానికి చాలా సంవత్సరాలే పడుతుందని ఇండ్రస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. నిజానికి `సర్కారువారి పాట` స్థానంలో అనిల్ రావిపూడితో సినిమా చేయాలనుకున్నాడు మహేష్. కానీ మహేష్‌కి నచ్చే కథ తీసుకురావడంలో అనిల్ రావిపూడి విఫలం అయ్యాడట. అందుకే `సర్కారు వారి పాట`కు పచ్చజెండా ఊపాడు మహేష్. ఎప్పుడైతే `సర్కారు వారి పాట` మొదలైపోయిందో అప్పుడే అనిల్ రావిపూడికి దారులు మూసుకుపోయాయి. మళ్లీ వీరిద్దరి కాంబో ఎప్పుడు సెట్ అవుతుందో?