రాజకుమారుడు.. ఎప్పటి సినిమా అండీ బాబు. మహేష్‌బాబు హీరోగా కొబ్బరికాయ్ కొట్టిన సినిమా. 1999లో విడుదలైంది. అంటే.. దాదాపు 18 ఏళ్లు గడిచిపోయాయన్నమాట. ఇప్పుడు ఈ సినిమా తమిళంలో డబ్ చేశారు. తుని చల్కారన్ పేరుతో. ఈ శుక్రవారం తమిళ నాట ఈ సినిమా విడుదలైంది. రిలీజ్ అన్నది నామ్ కా వాస్తే. ఈ సినిమాకి థియేటర్లు లేవు.. అది దొరికినా అందులో జనం లేరు. ఎప్పుడో జమానా క్రితం నాటి సినిమా ఇప్పుడు రిలీజ్ చేయడం ఏమిటి?? మహేష్ బాబు పరువు తీయడానికి కాకపోతే..??
ఇప్పుడిప్పుడే మహేష్ బాబుకి తమిళంలో క్రేజ్ పెరుగుతోంది. మహేష్ తాజా చిత్రాలన్నీ తెలుగుతో పాటు తమిళంలోనూ ఇంచు మించుగా ఒకేసారి విడుదల అవుతున్నాయి. వాటికి బాగానే వసూళ్లు దక్కుతున్నాయి. పైగా మహేష్ బాబు - మురుగదాస్ కాంబినేషన్‌లో ఓ చిత్రం తెరకెక్కుతోంది. తెలుగుతో పాటు తమిళంలోనూ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. మహేష్ తమిళంలో స్ట్రయిట్‌గా చేస్తున్న తొలి సినిమా ఇదే. మహేష్ సినిమా కంటే.. మురుగదాస్ సినిమాలానే తమిళంలో ప్రచారం చేస్తున్నారు. అయినా సరే... ఈ క్రేజ్‌ని ఉపయోగించుకోవాలని తమిళ నిర్మాతలు గట్టిగా ఫిక్స్ అయిపోయారు. మహేష్ పాత సినిమాలన్నీ ఇప్పుడు బూజు దులిపి మరీ బయటకు తీస్తున్నారు. వాళ్ల కంటికి రాజకుమారుడు కనిపించింది. వెంటనే డబ్బింగ్ చేసేసి.. మురుగదాస్ సినిమా కంటే ముందు విడుదల చేయాలని ఫిక్సయ్యారు. నిన్న రిలీజ్ చేసేశారు.. ప్రీతీ జింటా వాల్ పోస్టర్లు పెద్ద పెద్దగా ప్రింట్ చేయించి, మహేష్ లేటెస్ట్ ఫొటోలు పోస్టర్లపై ముద్రించి.. ఆడియన్స్ ని థియేటర్లకు రప్పించాలని ప్లాన్ వేశారు తమిళ నిర్మాతలు. కానీ అది కాస్తా తుస్ మంది. మహేష్ - మురుగదాస్ సినిమా రిలీజ్ కి ముందు ఇలాంటి వికృత ప్రయోగాలెందుకు చేయాలనిపించిందో..??