స్పైడర్ సినిమాతో తమిళ నాట అడుగుపెడుతున్నాడు మహేష్ బాబు. స్పైడర్ ని తమిళంలో కూడా భారీ ఎత్తున విడుదల చేస్తున్నారు. మురుగదాస్ అక్కడి వాడే. పైగా... మురుగదాస్ సినిమాలంటే ప్రత్యేకమైన అభిమానం. అక్కడి స్టార్ దర్శకులలో మురుగదాస్ కూడా ఒకడు. అందుకే.. తమిళ నాట ఈ సినిమాకి క్రేజ్ ఊపందుకొంది. తెలుగులో పబ్లిసిటీ చేసినా, చేయకపోయినా మహేష్ సూపర్ స్టారే.కానీ.. తమిళ నాట అలా కాదు. ఓ కొత్త హీరో రేంజులో ప్రమోషన్లు చేసుకోవాలి. అందుకే మహేష్ కూడా తమిళ పబ్లిసిటీపై ఎక్కువ దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. తెలుగు పబ్లిసిటీ సంగతి ఎలాగున్నా... తమిళనాట మాత్రం భారీగా ప్రమోషన్లు చేసుకోవాలని, అందుకోసం తాను చిత్రబృందానికి సహకరిస్తానని అంటున్నాడట. ఓ తమిళ స్టార్ సినిమా ఏ రేంజులో విడుదల చేస్తారో.. స్పైడర్‌ని కూడా అదే రేంజులో విడుదల చేస్తున్నారు. దాంతో పబ్లిసిటీకీ భారీగా ఖర్చు పెట్టమని నిర్మాతలకు సూచించాడట మహేష్. ఈ ప్రయత్నాలు ఎంత వరకూ ఫలిస్తాయో చూడాలి.