పంజా వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి హీరో హీరోయిన్లుగా పరిచయమవుతున్న చిత్రం 'ఉప్పెన'. సుకుమార్ శిష్యుడైన బుచ్చిబాబు సానా కు డైరెక్టర్‌గా ఇదే తొలి చిత్రం. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఈ చిత్రంలోని రంగులద్దుకున్న పాటను సూపర్ స్టార్ మహేష్‌బాబు నవంబర్ 11వ తేదీ సాయంత్రం 4:05 గంటలకు విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని మైత్రీ మూవీ మేకర్స్ అధినేతలు తమ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా ప్రకటించారు.
"ప్రేమ అనే మహాసముద్రంలోకి దూకేందుకు రెడీ అవ్వండి. నవంబర్ 11 సాయంత్రం 4:05 గంటల నుంచి మీ ఫేవరేట్ సాంగ్స్ ప్లేలిస్ట్‌లో 'రంగులద్దుకున్న' పాట ఉంటుంది. థాంక్యూ సూపర్‌స్టార్ మహేష్‌బాబు గారు" అని వారు ట్వీట్ చేశారు.
రాక్‌స్టార్ దేవి శ్రీప్రసాద్ సంగీతం సమకూర్చగా ఇప్పటికే విడుదలైన 'నీ కన్ను నీలి సముద్రం' పాట 140 మిలియన్ వ్యూస్ క్రాస్ చేయగా, 'ధక్ ధక్ ధక్' సాంగ్ 25 మిలియన్ వ్యూస్ దాటింది. ఇప్పుడు మూడో సాంగ్ 'రంగులద్దుకున్న' డీఎస్పీ నుంచి వస్తోన్న మరో చార్ట్‌బస్టర్ అని కచ్చితంగా చెప్పవచ్చు. దర్శకత్వం వహించడంతో పాటు 'ఉప్పెన'కు కథ, స్క్రీన్‌ప్లే, సంభాషణలను బుచ్చిబాబు అందించారు.
తమిళ స్టార్ యాక్టర్ విజయ్ సేతుపతి ఓ కీలక పాత్ర చేస్తున్న 'ఉప్పెన' చిత్రానికి సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్ సహా అన్ని పనులూ పూర్తయ్యాయి. సానుకూల పరిస్థితులు ఏర్పడి, థియేటర్లు తెరుచుకోగానే చిత్రాన్ని విడుదల చేయడానికి నిర్మాతలు సన్నద్ధంగా ఉన్నారు.