మహేష్ 'భరత్ అనే నేను' సినిమా అంత ఆషామాషీగా తెరకెక్కుతున్నట్లు లేదు. ముఖ్యమంత్రిగా కాన్ఫరెన్స్ హాల్‌లో కూర్చొని మంత్రులకు, అధికారులకు దిశా నిర్దేశం చేస్తున్నాడు సూపర్ స్టార్ మహేష్‌బాబు. వీటికి సంబంధించి రిలీజవుతున్న ఒక్కొక్క స్టిల్ అదిరిపోతోంది. టైటిల్ అనౌన్స్‌మెంట్ జరిగినాకనే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం టీజర్ విడుదల కాగానే ఆ అంచనాలు రెట్టింపయ్యాయి.
తాజాగా వస్తున్న స్టిల్స్ చూస్తుంటే, ఇంతవరకూ ఉన్న అంచనాలు పదింతలు అవుతున్నాయంటే అతిశయోక్తి కాదు. కొరటాల శివని అస్సలు తక్కువ అంచనా వేయలేం. రైటింగ్ డిపార్ట్‌మెంట్ నుండి వచ్చి డైరెక్టర్ అయ్యాడు కొరటాల. దాంతో డైలాగ్స్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటాడు. అందులోనూ పొలిటికల్ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కబోయే సినిమా అంటే డైలాగ్స్‌లో ఆ భారీ తనం ఏ స్థాయిలో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ముఖ్యమంత్రి అంటే ఏదో ఖద్దర్ బట్టలు వేసుకుని, లేదా పంచె కట్టుకుని కనిపించడమే మనకు తెలుసు. కానీ 'భరత్ అనే నేను' సినిమాలో ముఖ్యమంత్రిగా మహేష్ అంటే, యూత్‌కి ఐకాన్. స్టైలిష్ అండ్ కలర్‌ఫుల్ హ్యాండ్‌సమ్ గై.
ఏమో మొత్తానికి ఈ సినిమాతో మహేష్ - కొరటాల కొత్త సెన్సేషన్ సృష్టించేలానే ఉన్నారు. ఆల్రెడీ వీరిద్దరి కాంబినేషన్‌లో 'శ్రీమంతుడు' ఓ సంచలనం. మహేష్ కెరీర్ బెస్ట్ మూవీ అది. ఇప్పుడు దాని రికార్డుల్ని బద్దలుకొట్టే సినిమా 'భరత్ అనే నేను' అవుతుందేమో చూడాలిక. ఈ సినిమాలో సూపర్‌స్టార్ సరసన బాలీవుడ్ బ్యూటీ కైరా అద్వానీ నటిస్తున్న సంగతి తెలిసిందే.