సినిమా రంగం సెంటిమెంట్ల సమాహారం. ఇక్కడ హిట్ కాంబినేషన్లదే రాజ్యం. చేతిలో హిట్టుంటే.. బండి నల్లేరుపై నడకే. ఒకట్రెండు ఫ్లాపులు ఎదురైతే, ఐరెన్ లెగ్ ముద్ర పడిపోతుంది. ఇప్పుడు కీర్తి సురేష్ ఆల్మోస్ట్ ఐరెన్ లెన్ అనే అపప్రద మోస్తోంది. మహానటి తరవాత కీర్తికి హిట్స్ లేవు. చేసిన తొలి కమర్షియల్ సినిమా.. `అజ్ఞాతవాసి` అట్టర్ ఫ్లాప్ అయ్యింది. ఆ తరవాత.. `పెంగ్విన్` ఇప్పుడు `మిస్ ఇండియా` రెండూ డిజాస్టర్లే. ఈ సినిమాల వల్ల... నిర్మాతలు ఎంత వరకూ బాగుపడ్డారో తెలీదు గానీ, ఓటీటీలకు నష్టం వాటిల్లింది. కీర్తి ఇమేజ్ కూడా డామేజ్ అయ్యింది. దాంతో కీర్తిపై ఐరెన్ లెగ్ ముద్ర పడింది.
ఇప్పుడు ఇదే భయం `సర్కారు వారి పాట`ని వెంటాడుతోంది. మహేష్ బాబు - పరశురామ్ కాంబినేషన్‌లో రూపొందుతున్న సినిమా ఇది. కథానాయికగా కీర్తిని ఎంచుకున్న సంగతి తెలిసిందే. ఇలా వరుస ఫ్లాపులు ఎదుర్కొంటున్న కీర్తి వల్ల సినిమాకి ప్లస్ కాకపోగా.. మైనస్ అయ్యే ప్రమాదం ఏర్పడింది. హిట్టూ, ఫ్లాపూ అటుంచితే - `మిస్ ఇండియా` సినిమాలో కీర్తి లుక్ అస్సలు బాలేదు. కీర్తి మరీ పీలగా తయారైపోయింది. తనని గ్లామర్ రోల్ లో చూడడం కష్టమే. కీర్తి కాస్త బొద్దుగా మారి, లుక్ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటే తప్ప.. తనని చూడలేం. `సర్కారు వారి పాట`లో కీర్తి ఎలా మారుతుందో, దర్శకుడు ఎలా చూపిస్తాడో అన్నదే ప్రధానంగా మారింది. అసలే మహేష్ అందగాడు. తన పక్కన హీరోయిన్లు తేలిపోతుంటారు. కీర్తి కూడా తేలిపోతే.. అది సినిమాపై ప్రభావం చూపించే ప్రమాదం ఉంది.