నిప్పు లేకుండా పొగరాదన్న మాట అన్ని సందర్భాల్లోనూ నిజం కాకపోవచ్చు. కొన్ని సందర్భాల్లో అయితే నిజమే అవుతుంది కదా. 'స్పైడర్' సినిమాలో మహేష్‌బాబు 'స్పై'గా నటిస్తుండగా, 'లై' సినిమాలో నితిన్‌ది కూడా అలాంటి పాత్రేనని ఓ గాసిప్ పుట్టుకొచ్చింది. ఎంతో కొంత వాస్తవం లేకుండా ఈ గాసిప్ పుట్టదని భావించగలమా? ఏమో, చెప్పలేం. 'లై' సినిమాకి సంబంధించి దర్శక నిర్మాతలు చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. సినిమా కథేంటో మాత్రం చెప్పడంలేదు. కానీ 'అబద్ధం' తాలూకు ప్రముఖ్యత ఏంటి? అనేది టీజర్‌లో చెప్పేశారు. అర్జున్ ఈ సినిమాలో నెగెటివ్ రోల్‌లో కనిపించనున్నాడు. అతన్ని చట్టం ముందు దోషిగా నిలబెట్టేందుకు 'స్పై' రూపంలో నితిన్ పనిచేస్తాడని సమాచారం. ఇంకో వైపున 'స్పైడర్' సినిమాలో మహేష్‌బాబు పాత్ర కూడా ఇలాంటిదే. రెండూ టెక్నికల్‌గా చాలా సౌండింగ్ ఉన్న సినిమాల్లానే కనిపిస్తున్నాయి. 'లై'తో పోల్చితే 'స్పైడర్' భారీతనం చాలా ఎక్కువ. అలాగని 'లై'ని తక్కువగా చూడలేం. నితిన్ మార్కెట్ రేంజ్ కంటే ఎక్కువగా ఖర్చు చేసి 'లై' సినిమాని తెరకెక్కిస్తున్నారు. 'స్పైడర్' సినిమాని తెలుగు, తమిళ భాషల్లో విడుదల చేస్తారు. 'ఇండియన్ సినిమా' అనే స్థాయిలో 'స్పైడర్' చిత్రాన్ని రూపొందిస్తున్నారట. ఏదేమైనా 'లై', 'స్పైడర్' దేనికదే అన్నట్లు ఆయా సినిమాలపై భారీ అంచనాలున్నాయి. కాన్సెప్ట్ ఏదైనా ప్రేక్షకుల్ని అలరించడమే ముఖ్యం. ఆ ఆలరించడంలో రెండు సినిమాలూ ఒకదానితో ఒకటి పోటీ పడ్తాయని ఆశిద్దాం.