మహేష్‌బాబు వివాదాల్లో ఇరుక్కున్నాడు. మహేష్‌బాబు హీరోగా నటించిన 'శ్రీమంతుడు' చిత్రమే ఇందుకు కారణం. ఆ చిత్రానికి మహేష్ హీరోగానే కాకుండా సహ నిర్మాతగా కూడా వ్యవహరించాడు. సినిమాకి సంబంధించిన కథ వివాదం కోర్టులో ఉంది. తాను రాసిన 'చచ్చేంత ప్రేమ' నవలను కాపీ చేసి 'శ్రీమంతుడు' సినిమాని తెరకెక్కించారని రచయిత శరత్ చంద్ర న్యాయస్థానాన్ని ఆశ్రయించగా ఈ కేసులో మహేష్‌బాబుతో పాటు దర్శకుడు కొరటాల శివ తదితరులకీ న్యాయస్థానం నోటీసులు పంపింది. వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని న్యాయస్థానాన్ని మహేష్‌బాబు ఆశ్రయించగా, అలా కుదరదనీ, వ్యక్తిగతంగా హాజరు కావాల్సిందేనని న్యాయస్థానం స్పష్టం చేసింది. దాంతో మహేష్ కోర్టు మెట్లెక్కాల్సిన అవసరం ఏర్పడింది. కొరటాల శివ దర్శకత్వంలో మహేష్ హీరోగా నటించిన 'శ్రీమంతుడు' చిత్రం పెద్ద విజయాన్ని అందుకుంది. ఈ సినిమా విజయంతో పాటు, సామాజికంగా కూడా చాలా ప్రభావితం చేసింది. 'ఊరు దత్తత' అనే కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ సినిమా రీల్ పరంగా వసూళ్లు కొల్లగొట్టడమే కాకుండా, రియల్ శ్రీమంతుల్ని ఎందిరినో ఆకర్షించింది. తద్వారా పలువురు రియల్ శ్రీమంతులు కొన్ని కొన్ని గ్రామాలను దత్తత తీసుకుని వాటి అభివృద్ధికి తోడ్పడుతున్నారు. ముద్దుగుమ్మ శృతిహాసన్ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించింది.