స్వర్గీయ నందమూరి తారకరామారావు జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతోన్న చిత్రం 'ఎన్టీఆర్'లో కథానాయికల సందడి ఎక్కువైంది. ఇప్పటికే దాదాపు అరడజను మంది ప్రముఖ హీరోయిన్లు ఈ సినిమాలో భాగమయ్యారు. అన్నీ కీలకపాత్రలే. ఎన్టీఆర్ భార్య బసవతారకం పాత్ర మొదలుకొని శ్రీదేవి, సావిత్రి, జయప్రద, కృష్ణకుమారి.. ఇలా తదితర పాత్రలు ఎన్టీఆర్ సినీ ప్రస్థానంలో కీలక పాత్ర సంతరించుకున్నాయి. బాలీవుడ్ బ్యూటీ విద్యాబాలన్ బసవతారకం పాత్రలో ఇంపార్టెంట్ రోల్ పోషిస్తోంది.
మహానటి సావిత్రిగా నిత్యామీనన్ నటిస్తుండగా, జయప్రద పాత్రలో మిల్కీబ్యూటీ తమన్నా నటిస్తోంది. ఇక అతిలోక సుందరి శ్రీదేవి పాత్రను రకుల్ ప్రీత్‌సింగ్ దక్కించుకుంది. వీరి పాత్రల తాలూకు చిత్రీకరణలు దాదాపు పూర్తయినట్లే. తాజాగా ఈ లిస్టులో మరో ముద్దుగుమ్మ కూడా చేసింది. మలయాళ కుట్టీ మాళవికా నాయర్.
'ఎవడే సుబ్రహ్మణ్యం' సినిమాతో పరిచయమై 'కళ్యాణవైభోగమే', 'విజేత' చిత్రాలతో మంచి పేరు తెచ్చుకున్న ఈ నేచురల్ బ్యూటీ అలనాటి మేటి అందాల నటి కృష్ణకుమారి పాత్రను పోషించనుందట. అలా ఇప్పటికే ఇంతమంది ముద్దుగుమ్మలు ఈ బయోపిక్‌లో భాగమయ్యారు. ఇంకెంతమంది పేర్లు తెరపైకి వస్తాయో ముందు ముందు చూడాలిక. మరోవైపు యంగ్ హీరోలు రానా, కళ్యాణ్‌రామ్, సుమంత్ తదితరులు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్న సంగతి తెలిసిందే.
క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఎన్టీఆర్ బయోపిక్ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది. సినీ, రాజకీయ ప్రస్థానాలుగా రెండు భాగాలుగా ఈ బయోపిక్ రూపొందుతోన్న సంగతి తెలిసిందే.