చిత్రం: మళ్ళీ పెళ్లి
నటీనటులు: నరేష్ వికె, పవిత్ర లోకేష్, జయసుధ, శరత్ బాబు, వనిత విజయకుమార్
దర్శకత్వం: ఎంఎస్ రాజు
నిర్మాత: నరేష్ వికె
సంగీతం: సురేష్ బొబ్బిలి
ఛాయాగ్రహణం: ఏంఎన్ బాల్ రెడ్డి
కూర్పు: జునైద్ సిద్ధిక్
బ్యానర్: విజయ కృష్ణ మూవీస్
విడుదల తేదీ: 26 మే 2023
ఐక్లిక్ మూవీస్ రేటింగ్: 2.5/5
సినీ తారల వ్యక్తిగత జీవితంలోకి తొంగి చూడడం, వాళ్ల దైనందిన వ్యవహారాల్లో ఏం జరుగుతోందో తెలుసుఎకోవాలన్న కుతూహలం ఏర్పాటు చేసుకోవడం ఈ రోజు సర్వసాధారమైన విషయాలు అయిపోయాయి. నరేష్ - పవిత్ర లోకేష్ పర్సనల్ లైఫ్ కూడా చాలాసార్లు మీడియాకు ఎక్కింది. వీరిద్దరి సహజీవనం గురించి మీడియా కథలు కథలుగా రాసింది. ఈ విషయమై నరేష్, పవిత్రలు కూడా చాలాసార్లు క్లారిటీ ఇచ్చారు. అయితే... అదంతా ఒక కోణమే. మరో కోణంలో వీరిద్దరి జీవితంలో ఏం జరిగింది? ఎలా జరిగింది? అసలు వీరిద్దరూ ఎందుకు కలుసుకోవాలనుకొన్నారు? ఆ పరిస్థితులేంటి? ఇవన్నీ సవివరంగా వివరించడానికి ఓ సినిమా వస్తే.. అదే మళ్లీ పెళ్లి.
కథ: నరేంద్ర (నరేష్) ఓ సినీ నటుడు. డబ్బు, పలుకుబడి అన్నీ ఉన్నాయి. కానీ భార్య సౌమ్య విషయంలో అసంతృప్తితో ఉంటాడు. అప్పటికే రెండు పెళ్లిళ్లు అయిపోతాయి. మూడో పెళ్లి కూడా పెటాకుల దిశగా అడుగులు వేస్తుంటుంది. మనసులో అంత బాధ ఉన్నా - పైకి నవ్వుతూ ఉంటాడు. పార్వతి (పవిత్ర లోకేష్)ది మరో కథ. తను కూడా నటే. ఒకరితో సహజీవనంలో ఉంటుంది. ఇద్దరు పిల్లలు కూడా. కానీ.. తనకీ చాలా విషయాల్లో అసంతృప్తులు ఎదురవుతుంటాయి. ఈ దశలో నరేంద్ర, పార్వతిలకు పరిచయం అవుతుంది. అది స్నేహంగా మారుతుంది. ఆ తరవాత ఏం జరిగింది? నరేంద్ర తన భార్య విషయంలో ఎలాంటి తలనొప్పులు ఎదుర్కొన్నాడు? నరేంద్ర, పార్వతిలు కలిశారా? అందుకు ఈ సమాజం ఒప్పుకొందా? అనేది మిగిలిన కథ.
విశ్లేషణ: ఇది నా బయోపిక్ కాదు` అని నరేష్ పైకి చెబుతున్నారు కానీ, ఆయన జీవితాన్ని పరిశీలించిన ఎవ్వరికైనా ఇది పూర్తిగా నరేష్ కథ అని అర్థం అవుతుంది. ఆయన కథతో పాటు విజయ నిర్మల, కృష్ణ ట్రాక్ ని కూడా తెరపైకి తీసుకొచ్చారు. మరో విధంగా ఇది పవిత్ర లోకేష్ బయోపిక్ కూడా. వీరిద్దరి జీవితాల్లో ఏం జరిగింది? వాళ్లిద్దరూ ఎందుకు దగ్గరయ్యారు? అనే పాయింట్ ఆఫ్ వ్యూలో సాగుతుంది సినిమా. కథన ప్రకారం ఆసక్తి రేపడానికి దర్శకుడు ఈ కథని కొన్ని చాప్టర్లుగా విడగొట్టి, ప్రతీ చాప్టర్ లోనూ కొన్ని కీలకమైన విషయాలు చెప్పడానికి ప్రయత్నించాడు. అయితే అవన్నీ సోషల్ మీడియా ద్వారా ప్రేక్షకులకు తెలిసిన విషయాలే.
ఎవరి కథలో అయినా తామే హీరోలు. అలా.. నరేష్ తీసుకొన్న సినిమా కాబట్టి, తనలోని పాజిటీవ్ కోణాలే చూపించే ప్రయత్నం చేశారు. భార్య పాత్రలో సౌమ్యని విలన్ గా తీర్చిదిద్దారు. తాను విపత్కర పరిస్థితుల్లో పార్వతితో అనుబంధం కొనసాగించాల్సివచ్చిందన్న కోణంలో ఈ సినిమా తీశారు. అవన్నీ జనాలు నమ్ముతారా? లేదా? సినిమాలో చూపించినవన్నీ నిజాలా? అనేది మరో డిబేట్. ఈ సినిమాని సినిమాగా చూస్తే మాత్రం కొన్ని ప్లస్ పాయింట్లు, ఇంకొన్ని మైనస్ పాయింట్లు కనిపిస్తాయి.
రెండు ప్రధాన పాత్రల్లోనూ పెయిన్ ఉంది. కానీ.. దాన్ని ప్రేక్షకుల ఫీల్ అయ్యేలా తెరపై చూపించలేదు. నరేంద్ర, పార్వతిల లవ్ ట్రాక్ లో మెచ్యూరిటీ కనిపించలేదు. అదేదో టీనేజ్ లవ్ స్టోరీలా డిజైన్ చేశారు. పార్వతి ఫ్లాష్ బ్యాక్ సైతం ఆకట్టుకోదు. ఇక క్లైమాక్స్ అయితే తేలిపోతుంది. మైసూర్ హోటెల్ లో.. నరేష్, పవిత్ర లోకేష్‌లు మీడియాకు దొరికిన పోయిన వైనమే ఈ క్లైమాక్స్. ఆ రోజు ఏం జరిగింది? అనేది క్లైమాక్స్ లో చూపించడానికి ప్రయత్నించారు. ఆ తరవాత పార్వతి, నరేంద్ర పెళ్లి చేసుకొన్నారా? సౌమ్యతో విడాకులు ఏమైంది? అనేది మాత్రం తెరకు చెప్పలేదు.
నటీనటులు: నరేష్.. తన అనుభవాన్నంతా రంగరించే ప్రయత్నం చేశారు. ఆయనది హీరో స్థాయి పాత్రే. పాటలూ, ఫైట్లూ లేవు కానీ సంఘర్షణ మాత్రం ఉంది. దాన్ని బాగానే పలికించారు. పార్వతిగా పవిత్ర పాత్ర కూడా బాగానే డిజైన్ చేశారు. చాలా చోట్ల ఆమె డైలాగ్ మాడ్యులేషన్ కట్టిపడేస్తుంది. శరత్ బాబు ఆఖరి చిత్రం ఇది. ఆయన కృష్ణ ని పోలిన పాత్రలో కనిపిస్తారు. విజయ నిర్మల పాత్రలో.. జయసుధ దర్మనమిచ్చారు. అయితే.. నరేష్ ఆమెను `మమ్మీ` అని పిలవడం మాత్రం ఆకట్టుకోదు. ఎందుకంటే ఇద్దరిదీ సమానమైన వయస్సే. సౌమ్య పాత్రలో కనిపించిన నటి ఆకట్టుకొంటుంది. ఓరకంగా ఆమే ఈ కథకు విలన్.
సాంకేతిక నిపుణులు: సంగీతం, ఛాయాగ్రహణం ఓకే అనిపిస్తాయి. నిర్మాణ విలువలు కూడా బాగున్నాయి. కథకుడిగా ఎం.ఎస్.రాజు మెరుపులేం చూపించలేదు. కొత్త విషయాలు చెప్పలేదు. ఆల్రెడీ మీడియాలో ఉన్న కథనాలే సినిమాగా తీశారా అనిపిస్తుంది. మాటలు అక్కడక్కడ ఫన్నీగా ఉన్నాయి. పాటలు కథలో కలిసిపోయాయి. పవిత్ర లోకేష్ ఫ్లాష్ బ్యాక్ ట్రిమ్ చేయాల్సింది.
ప్లస్ పాయింట్స్
టైటిట్
నిజ జీవిత సంఘటనలు
మైనస్ పాయింట్స్
డ్రామా పండకపోవడం
క్లైమాక్స్ తేలిపోవడం
ఫైనల్ వర్డిక్ట్ : నరేష్ - పవిత్రల బయోపిక్...