ఈవారం నాగార్జున `మన్మథుడు`కి దాదాపుగా సోలో రిలీజ్ దక్కింది. అనసూయ కథనం, సంపూర్ణేష్ బాబు కొబ్బరి మట్ట సినిమాలు విడుదల అవుతున్నా - అవి నాగ్ సినిమాకి ఏమాత్రం పోటీ కావు. పైగా నాగ్‌కి సెలవలు బాగా కలిసొస్తున్నాయి. ఆగస్టు 12 (బక్రీద్), 15 (స్వాతంత్ర్య దినోత్సవం) రెండూ సెలవలే. సినిమా ఏమాత్రం బాగున్నా - సినీ ప్రేమికులకు, కుటుంబ సభ్యులకు... నాగ్ సినిమా మంచి ఆప్షన్ అవుతుంది. ఈ సినిమాపై నమ్మకంతో కొన్ని చోట్ల నాగార్జున ఈ సినిమాని సొంతంగా విడుదల చేసుకుంటున్నారు.
ఇప్పటి వరకూ ఈ సినిమాకి 20 కోట్ల వరకూ బిజినెస్ జరిగిందని సమాచారం. ఉత్తరాంధ్ర, కృష్ణాలలో నిర్మాణ సంస్థే సొంంతంగా విడుదల చేస్తోంది. నైజాంలో థియేటర్ల నుంచి అడ్వాన్సులు తీసుకుని సినిమాని విడుదల చేస్తున్నారు. ఓవర్సీస్‌లో 2.5 కోట్లు పలికింది మన్మథుడు. సీడెడ్‌లో 2.5 కోట్లు, ఆంధ్రాలో 7 కోట్లూ వచ్చాయి. నాగార్జున గత చిత్రాలతో పోలిస్తే ఇవి మెరుగైన అంకెలే. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రకుల్ కథానాయికగా నటించింది. సమంత, కీర్తి సురేష్ అతిథి పాత్రలలో కనిపించనున్నారు.