'మన్మథుడు 2' ట్రైలర్లో గుప్పు గుప్పుమంటూ పొగ వదులుతూ... షాక్ ఇచ్చింది రకుల్ ప్రీత్ సింగ్. ఎప్పుడూ లేనిది... సిగరెట్లు తెగ కాల్చేస్తోందేంటి? అంటూ ఆశ్చర్యపోయారంతా. సిగరెట్లు మాత్రమేనా? సినిమా కోసం అంతకు మించి ఏమైనా చేసిందా? అంటూ ఆరాలు తీయడం మొదలెట్టారు. ఈ సినిమాలో సిగరెట్లు కాల్చి, డేరింగ్ స్టెప్పే వేశారు కదా.. అని రకుల్‌ని అడిగితే.. కాస్త ఘాటుగానే కౌంటర్ ఇచ్చింది. హీరోలు సిగరెట్లు తాగితే అడగరని, అదే హీరోయిన్లు చేస్తే తప్పుగా భావిస్తారేంటని? ఎదురు ప్రశ్నించింది. సమాజంలో ఇంతకు మించి చాలా చాలా జరుగుతున్నాయని, సినిమాల్లో చూపించేది చాలా కొంచెమే అని సమాధానం ఇచ్చింది.
సినిమాల్లో ఏమైనా చూపిస్తే అప్పుడు సంస్క్కృతి సంప్రదాయాలు గుర్తొస్తాయని, బయట ఎన్ని జరుగుతున్నా ఎవ్వరూ పట్టించుకోరని కాస్త గట్టిగానే చెబుతోంది. అయినా.. ఈ సినిమా కోసం రెండు సార్లు మాత్రమే సిగరెట్లు కాల్చానని, అది కూడా పాత్రని దృష్టిలో ఉంచుకుని చేసిన పనే అని, నిజ జీవితంలో తాను స్మోకర్ని కాదని, ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తలు తీసుకుంటానని సమాధానం చెప్పింది. తను నటించిన 'మన్మథుడు 2' ఈ వారమే ప్రేక్షకుల ముందుకు వస్తోంది.